Close

ఏలూరు, ఫిబ్రవరి, 01:కార్పోరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా విద్యా, వైద్యం, పర్యావరణ పరిరక్షణ తదితర సామాజిక కార్యక్రమాల అమల్లో పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్ధలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు.

Publish Date : 01/02/2023
సీఎస్ఆర్ నిధులతో సామాజిక కార్యక్రమాలు …
ప్రభుత్వం, ఇతర రంగాలు ఉమ్మడిగా పనిచేస్తే సమ్మిళిత ప్రగతికి ఆస్కారం …
మనపరిశ్రమ బాగుండటంతో పాటు మన సమాజం కూడా బాగుండాలనే విశాల దృక్పధంతో ఉంటేనే సిఎస్ఆర్ కి ఒక అర్ధం పరమార్ధం ..
.. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ .
ఏలూరు, ఫిబ్రవరి, 01:కార్పోరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా విద్యా, వైద్యం, పర్యావరణ పరిరక్షణ తదితర సామాజిక కార్యక్రమాల అమల్లో పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్ధలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో సి ఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ సిఎస్ఆర్ కింద పరిశ్రమలు తమ సొంత ప్రణాళికల ప్రకారం నిధులు ఖర్చుచేస్తే ఆడిట్ సమస్య రావచ్చునని మరియు అప్రధాన అంశాలకు అవకాశం ఉంటుందన్నారు. అంతేగాక ప్రభుత్వం లేదా ఇతర సంస్ధలు అదే కార్యక్రమాన్ని చేపట్టిఉంటే ఆపని డూప్లికేషన్ అయ్యే అవకాశం ఉందని అందువలన తమ ప్రతిపాధనలను జిల్లా సిఎస్ఆర్ కమిటీ ముందు ఉంచితే అలాంటి సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. కమిటీ సమీక్షించి సదరు ప్రతిపాధనలు ఆమోదించినట్లయితే దానికి సంబంధించిన ధృవపత్రాన్ని కంపెనీలకు జారీ చేయడం జరుగుతుందన్నారు. మన పరిశ్రమ బాగుండటంతో పాటు మన సమాజం కూడా బాగుండాలనే విశాల దృక్పధంతో ఉంటేనే సిఎస్ఆర్ కి ఒక అర్ధం పరమార్ధం అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మన ఎదుగుదలకు ఇంత ఇచ్చిన సమాజానికి తిరిగి మనం ఏమి ఇస్తున్నామనే దృక్పధంతో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు సమాజ అభివృద్ధిలో సీఎస్ఆర్ ద్వారా భాగస్వాములు కావాలన్నారు. సామాజిక అవసరాలకోసం రూ. 5 కోట్లు ఆపైన నికర లాభం కలిగిన కంపెనీలు గత మూడు సంవత్సరాల సగటు నికర లాభంలో కనీసం 2 శాతం నిధుల్ని ఏటా సీఎస్ఆర్ కింద ఖచ్చితంగా వ్యయం చేయాలన్నారు.
సీఎస్ఆర్ నిధులతో వినూత్న, ప్రజాప్రయోజిత కార్యక్రమాలు .. సీఎస్ఆర్ నిధులతో జిల్లాలో విద్యా, వైద్య పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాలుచేపడతామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో విజయవాడ సరిహద్దు నుంచి రాజమండ్రి వరకు 100 కిలో మీటర్లు పైబడి జాతీయ రహదారి ఉందన్నారు. ఈ మధ్య మార్గంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలకు గురైన వారికి అత్యవసర వైద్యం అందించేందుకు అవసరమైన ట్రామా కేర్ సెంటర్ లేదని ఈ దృష్ట్యా భీమడోలు సిహెచ్ సిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు అవసరమైన భవన నిర్మాణానికి ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారని ఇతర మౌలిక సదుపాయాలు వైద్య పరికరాలు ఏర్పాటు చేయవలసిఉందన్నారు. ఇందుకు సీఎస్ఆర్ ద్వారా ఆయా పరిశ్రమలు ముందుకు వస్తే చాలామంది ప్రాణాలను కాపాడే అవకాశం కలుగుతుందన్నారు. ఇటువంటి తరహా కార్యక్రమాలకు పరిశ్రమల యాజమాన్యాల సహకారం ఎంతైనా అవసరం అన్నారు. అదే విధంగా గిరిజన ప్రాంతంలో సికిల్ సెల్ అనీమియా వ్యాధితో ఎంతోమంది బాధపడుతున్నారని ఈ దృష్ట్యా అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అదే విధంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్బిణీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారానికి అధనంగా మరింత సమకూర్చి వారిలో హిమోగ్లోబిన్ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. తద్వారా తల్లీ, బిడ్డలను రక్షించగలిగినవారమవుతామన్నారు. ఇటువంటి కార్యక్రమానికి కూడా సీఎస్ఆర్ ద్వారా సహకారం అందించాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారుల్లో లెర్నింగ్ స్కిల్స్ పెంచేందుకు ఆటపాటలకు ప్రత్యేక సౌకర్యాల కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు చెప్పారు. మరి ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో పర్యావరణ అభివృద్ధి, కాలుష్యనియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కొల్లేరు అభయారణ్యంలో పెలికాన్ తదితర పక్షులు నివాసం, రీ ప్రొడక్షన్ కోసం అవసరమైన ఏర్పాట్లుకు చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాల కోసం ఆయా పరిశ్రమలు తమ ప్రతిపాధనలతో ముందుకు వస్తే నిధులు వినియోగాన్ని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. జిల్లాలో సీఎస్ఆర్ కింద మరిన్ని వినూత్న ప్రజా ప్రయోజిత పనులకు నిధులు వినియోగించే విషయంపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం .. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే దిశగా జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఆర్ధికాభివృద్ధికి దోహదం చేసే పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని సమకూర్చడం, సింగిల్ డెస్క్ ద్వారా ఇతర అనుమతులను అందిస్తామన్నారు. ఈ విషయంలో తమను వ్యక్తిగతంగా సంప్రదించవచ్చన్నారు. పరిశ్రమలు ఏర్పాటు ద్వారా మరింత ఉపాధి, అభివృద్ధి కలుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు , జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం పి ఏసుదాసు, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, పంచాయితీ రాజ్ ఎస్ ఇ చంద్రభాస్కరరెడ్డి, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, ఛీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ త్రినాథ్, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగేశ్వరావు సిపిఓ నాగేశ్వర రావు,పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుమధుర వాణి, ఆయా శాఖల అధికారులు,పారిశ్రామిక వేత్తలు, వివిధ పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.
——————————————————————————-
( జిల్లా సమాచార పౌర సంబంధాధికారి, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది )