ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం ప్రారంభం పధకాన్ని ప్రారంభించిన జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాక్రిష్నయ్య (చంటి)
ఏలూరు, జనవరి, 4 : ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని’ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)లతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేయడం విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి విద్యే ప్రధమ ప్రాధాన్యతగా చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కె. వెట్రిసెల్వి సూచించారు. . విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రతీ విద్యార్థి కష్టంతో కాక ఇష్టంతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్లాలన్నారు. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం’ ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు శనివారం నుండి భోజనం అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 19 కళాశాలల్లోని 3860 మంది విద్యార్థినీ, విద్యార్ధ్జులకు మధ్యాహ్న భోజనం తో పాటు, ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పధకం ద్వారా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు. కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వారికి స్టడీ మెటీరియల్ కూడా అందించి, విద్యా బోధన చేస్తున్నారన్నారు. .
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాక్రిష్ణయ్య (చంటి) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. పాఠశాల విద్యార్థులతోపాటు కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పధకం, పాఠ్య, నోట్ పుస్తకాలు అందించడం శుభపరిణామమమన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు తమకు టాయిలెట్స్ సౌకర్యం, క్రీడా సౌకర్యం, పరికరాలు అందించాలని కలెక్టర్ ను కోరగా వెంటనే వాటిని ఏర్పాటుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పధకం, పాఠ్య, నోట్ పుస్తకాలు అందించడంపై విద్యార్థినీ, విద్యార్థులు తమ హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మ, ఆర్టీసీ విజయవాడ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, తహసీల్దార్ శేషగిరిరావు, ఏలూరు నగరపాలక సంస్థ కో ఆప్షన్ మెంబెర్ ఎస్.ఎం. ఆర్. పెదబాబు, కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు, ప్రభృతులు పాల్గొన్నారు.