Close

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో త్రాగునీరు సరఫరా, వైద్య శిబిరాలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

Publish Date : 26/07/2024

ఏలూరు, జులై, 26 : వరద ముంపు గ్రామాలలో సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రధానంగా దృష్టి సారించారు. . వరద సహాయ కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వరద సహాయక చర్యల పర్యవేక్షణకు నియమించిన మండల, గ్రామ ప్రత్యేక అధికారులు కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని వరద నీరు కారణంగా రహదారి సౌకర్యం దెబ్బతిన్న ప్రతీ గ్రామానికి వెళ్లి ప్రతీ కుటుంబానికి ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మేడేపల్లి, కోయమాధవరం, దాచారం గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందిస్తున్నారు. అంతేకాక ఆయా గ్రామంలో పారిశుధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. డ్రైన్లలో మురుగు, రోడ్లపై చెత్తను తొలగిస్తున్నారు. దోమలు ప్రబలకుండా ఫాగ్గింగ్ చేస్తున్నారు. బొల్లాపల్లి, కొయిదా, నార్లవారం, పడమటిమెట్ట, అరవపల్లె, దామచర్ల , మర్రిపాడు, కుక్కునూరు గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. తమ సహాయక కార్యక్రమాలపై ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటున్న కలెక్టర్ వెట్రిసెల్వి కి ఆయా గ్రామాల ప్రజలు తమ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు.