కొవ్వలిలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు,/దెందులూరు, జనవరి, 4 : ఏలూరు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను దెందులూరు మండలం కొవ్వలి జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు. ముందుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ సైన్స్ పరిశోధనలపట్ల విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు పద్మశ్రీ సూచించారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీస్తాయన్నారు. రేపటి పౌరుల్ని ప్రతిభ కల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వరదలు, రోడ్డు, అగ్నిప్రమాదాలు, జనసమ్మర్థం కలిగిన ప్రదేశాలలో ఏదైనా ప్రమాదాలు జరిగితే టెక్నాలజీ ద్వారా నివారించడం, రోడ్లు శాశ్వతంగా మరమ్మత్తులకు గురికాకుండా, చెత్త ను పర్యావరణహితంగా నిర్మూలించడం, వంటి అనేక సామజిక అంశాలపై చిన్నతనంలోనే పరిశోధనలు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇటువంటి కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్ధ్జులలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలోని పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక అంశాలలో ఉత్తమమైన 81 ప్రదర్శనలను జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలలో ప్రదర్శించడం జరిగిందన్నారు. వీటిలో ఉత్తమమైన వాటిని రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించేలా విద్యార్థులలో ప్రేరణ కలిగించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మ, తహసీల్దార్ సుమతి, ఎంపిడిఓ శ్రీదేవి, డిప్యూటీ డీఈఓ రామన్నదొర, జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓ లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎల్. ఎన్ .వి.జి. శర్మ, సర్పంచ్ మధులత, ఉప సర్పంచ్ జి. కొండలరావు, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ గణేష్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.