ఏలూరు జిల్లాలో నీట్ పిజి ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.

Publish Date : 28/08/2026

ఏలూరు, ఆగష్టు, 28 ; ఏలూరు జిల్లాలో నీట్ పిజి ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వైద్య సీట్ల కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష అని, ఈనెల 30వ తేదీన ఏలూరు లో పరీక్ష సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా సమయాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో నీట్ పిజి ప్రవేశ పరీక్షకు 389 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఏలూరులోని సర్.సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 214 మంది మరియు సిద్దార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ స్కూల్ లో 175 మంది హాజరవుతున్నారని, పరీక్ష 30వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12. 30 నిల వరకు నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులను ఉదయం 7 గంటల నుండి పరీక్షా కేంద్రాలలో అనుమతిస్తారన్నారు. పరీక్ష నిర్వహణకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, ఇంటర్నెట్ సరఫరాలో కూడా అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచాలని విద్యుత్, ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, పరీక్షా కేంద్రాల వద్ద సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. 30వ తేదీ ఉదయం నుండి ఏలూరు నగరంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిశ్రలలలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ డిఎంహెచ్ఓ ని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.