జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ లలో పరిశ్రమల స్థాపనకు ‘ఇన్వెస్ట్మెంట్ మీట్’ ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 29/08/2026

ఏలూరు, ఆగష్టు, 29 : జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ లలో పరిశ్రమల స్థాపనకు ‘ఇన్వెస్ట్మెంట్ మీట్’ ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నామని, సదరు ఎంఎస్ఎంఈ పార్క్ లలో పరిశ్రమలు స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక ‘ఇన్వెస్ట్మెంట్ మీట్’ ను త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ లలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 192 లక్ష్యానికి గాను 79 ఏర్పాటుచేశారని, మిగిలినవి త్వరిగతిన ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని, బ్యాంకర్ల నుండి రుణాల మంజూరు లో ఎల్డిఎమ్, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పార్టీనేర్షిప్ సమ్మిట్ లో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చి ఎంఓ యు లు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల స్థాపన పనులు చురుకుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గత నెలరోజులలో పరిశ్రమల స్థాపనకు 53 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేయగా సింగిల్ విండో విధానంలో 37 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన వాటిలో నిబంధనలమేరకు ఉన్న వాటిని నిర్దేశించిన సమయంలోగా మంజూరు చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలను సంబంధిత శాఖల అధికారులతో కూడిన కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతికి సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సమర్పించిన ప్రతిపాదనలను మరల ఒకసారి పరిశీలించి తదుపరి సమావేశంలో సమర్పించాల్సిందిగా పరిశ్రమల శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు.

ఏలూరులో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్ ను ఏర్పాటుచేయవలసిందిగా ఆదేశించినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవడంపై మెప్మా పీడీ రాజబాబు పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా రూపొందించేందుకు స్వయం సహాయక సంఘాలచే ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్ ను ఏర్పాటుచేయవలసిందిగా గత సమావేశంలో ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ప్రశ్నించారు. రెండురోజుల్లో యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మెప్మా పిడి ని ఆదేశించారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల అమ్మకాలకు “స్వయం మేళా” కార్యక్రమం ఏర్పాటుచేయవల్సిందిగా డిఆర్డిఏ పీడీ ని ఆదేశించినప్పటికీ ఇంతవరకు నిర్వహించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “స్వయం మేళా” కార్యక్రమం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ పీడీ ని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, పొల్యూషన్ కంట్రోల్ ఇఇ ఏ.శ్రీరామచంద్ర మూర్తి, జిల్లాపంచాయతీశాఖ అధికారి జి.మల్లిఖార్జున రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.యు.శోభ, డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, డిఆర్డిఏ పిడి టి.వి.విజయ లక్ష్మి, సిపివో బి.శ్రీదేవి, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్ర బాబు, పంచాయతీ రాజ్ ఎస్ఈ జెడ్. రమేష్, జిల్లా గ్రౌండు వాటరు డిడి పైలా కోదండరామ్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.