జిల్లాలో ‘రాష్ట్రీయ పోషన్ మాహ్’ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.
ఏలూరు, ఆగష్టు, 29 : జిల్లాలో ‘రాష్ట్రీయ పోషన్ మాహ్’ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం ‘రాష్ట్రీయ పోషన్ మాహ్’ మాసోత్సవాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సెప్టెంబర్ 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలోని ప్రతీ అంగన్వాడీ కేంద్రాలలో రాష్ట్రీయ పోషన్ మాసోత్సవాలను నిర్వహించేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలకు ఆరోగ్యం, పోషణ కి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహనకు “ప్రోటీన్-రిచ్ ప్లేట్” కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అతి తీవ్రమైన పోషకాహార లోపం (సామ్) పిల్లలను గుర్తించడం, వారి నిర్వహణ తో పాటు పోషణ్ వాటికాస్- న్యూట్రీ గార్డెన్స్ ని అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలన్నారు.. తల్లి పాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పనతో పాటు, పుట్టిన బిడ్డ మొదటి 1000 రోజులలో మంచి పోషణ అవసరాలు, యువతులు, పిల్లలలో రక్తహీనతను తగ్గించే చర్యలపై అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో తాజాగా, వేడిగా వండిన భోజనం అందించడం, సామాజిక భాగస్వామ్యం & జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కార్యక్రమంపై అవగాహన కలిగించాలన్నారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు మరియు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన మరియు విభిన్నమైన వంటకాలపై వాటి పోషక విలువలపై అవగాహన కలిగించాలన్నారు. గ్రామాలు, మండలాల్లో పోషన్ మేళాలు నిర్వహించాలన్నారు.
సమావేశంలో ఐటిడిఏ పీఓ రాములు నాయక్, ఐసిడిఎస్ పీడీ శారద, డిపిఓ మల్లికార్జునరావు, పంచాయత్ రాజ్ ఎస్ఈ జెడ్. రమేష్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ డా. శోభ,గ్రామ వార్డ్ సచివాలయాలు సమన్వయాధికారి నాయుడు మెప్మా పీడీ రాజబాబు, ప్రభృతులు పాల్గొన్నారు.