Close

దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లు పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి.

Publish Date : 02/01/2025

ఏలూరు, జనవరి, 2: సదరం సర్టిఫికెట్ల జారీపై వైద్య బృందాల పరిశీలన కొరకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం అమరావతి నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.కన్నబాబు, సెర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ సదరం సర్టిఫికెట్ల పంపిణీపై రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్ధానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ వారితోపాటు డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఎం హెచ్ఓ డా. మాలిని, డిసిహెచ్ఎస్ డా . పాల్ సతీష్, నగరపాలకసంస్ధ కమీషనరు ఎ. భానుప్రతాప్, డిపివో కె. అనురాధ, డిఐఓ డా. నాగేశ్వరరావు, జిజిహెచ్ఎస్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, తదితరులు హాజరయ్యారు. దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15వేలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ తెలిపారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందే వారిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని కృష్ణ బాబు తెలిపారు. అందులో భాగంగా పరిశీలన చేపడుతున్నామన్నారు. ఇందుకోసం వైద్య బృందాలను నియమిస్తామన్నారు. సధరమ్ ద్వారా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలన్నారు. పరిశీలన కొరకు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. విషయాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ట్యాంపరింగ్ వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేకంగా నియమించిన వైద్య బృందాలకు సహాయ సహకారాలు అందించడానికి సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లను నియమించాలన్నారు. వారి ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారించాలన్నారు. అనర్హులుంటే వారి వివరాలను సంబంధిత వైద్యాధికారులు తక్షణమే యాప్ లో నమోదు చేయాలన్నారు. వైద్యుల ధ్రువీకరణతో ధ్రువీకరణ పత్రాలు సైతం రద్దు అవుతాయన్నారు. సోమవారం నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించాలని, విచారణకు సంబంధించిన మార్గదర్శకాలు పంపుతామన్నారు. నూరు శాతం నిక్కచ్చిగా పరిశీలన, విచారణ ప్రక్రియ జరుగుతుందన్నారు. బృందాలను పర్యవేక్షించుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులను ఉద్ధేశించి మాట్లాడుతూ సదరం సర్టికెట్ల పరిశీలనకు రూపొందించిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు క్షుణంగా తెలుసుకొని విజయవంతం చేసేందుకు విచారణపై పలు సూచనలు చేశారు. సదరం సర్టిఫికెట్లకు సంబంధించి రూపొందించిన యాప్ గురించి క్షుణంగా తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి రూపొందించిన షెడ్యూల్ ప్రకారం డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహించి పరిశీలన నివేదికను ఏరోజుకారోజు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన బృందాలను ఏర్పాటు చెయ్యాలని, ఈ బృందంలో ఫిజిషియన్, ఎముకల డాక్టర్ల స్పెషలిస్టులు ఉండాలని తెలిపారు. తనిఖీలకు వచ్చే ముందురోజు గ్రామాల్లో సమాచారం తెలియజేయాలని తెలిపారు. జిల్లాస్ధాయి కమిటీకి అధ్యక్షతగా జిల్లా కలెక్టర్, కన్వీనర్ గా డిఆర్డిఏ పిడి, డిసిహెచ్ఎస్ లు ఉంటారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1496 మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టిన కేటగిరిలో రూ.15వేలు చొప్పున ప్రతి నెల పింఛన్ పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు విచారణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వైద్య బృందాల పరిశీలన కొరకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లాకు విజయవాడ జిజిహెచ్ నుంచి వచ్చే వైద్య బృందానికి యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు, సచివాలయ సిబ్బంది, స్ధానిక పిహెచ్ సి వైద్యులు సమన్వయం చేసుకోవాలన్నారు.