పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు 276.. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,జనవరి, 6: పిజిఆర్ఎస్(ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ) ద్వారా అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్ధాయి పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి.. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్వో వి. విశ్వేశ్వరరావు,ఆర్డివో అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ లతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించి నాణ్యతగల ఎండార్స్ మెంట్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో 276 అర్జీలు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా శాఖాధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలుతీసుకోవాలని తెలిపారు.
అందిన అర్జీలలో కొన్ని..
ఏలూరుకు చెందిన పాల వెంకటరమణ దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు నుంచి 15 వేలకు పెంచాలని కలెక్టర్ కు అర్జీ అందజేశారు. మండవల్లి మండలం కొవ్వూరుకు చెందిన గుడివాడ ఇందిర తన అనుమతి లేకుండా తన భూమిని చెరువుగా మార్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయుమని అర్జీ అందజేశారు. ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన గరికిముక్కు భవాని ప్రభుత్వ కాలేజిలో బిఎస్సీ నర్సింగ్ సీటు ఇప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు. కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామానికి చెందిన కూసిమంచి చంద్రరావు సర్వే నెంబరులోని 0.34 సెంట్ల భూమిని తన పేరున ఆన్ లైన్ చేయవలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు. ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన కుప్పా వెంకట్రావు తన వ్యాపార స్ధలం ప్రక్కన పెంటకుప్పవేసి పరిసర ప్రాంతాలవారికి దుర్వాసన వచ్చిఅసౌకర్యంగా ఉందని పెంటకుప్పను తొలగించాలని అర్జీ అందజేశారు.
కార్యక్రమంలో వివిధశాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.