Close

ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 04/01/2025

ఏలూరు,జనవరి 4: జిల్లాలో ఈనెల 6వ తేదీ నుండి చేపట్టే మెడికల్ పెన్షన్ల రీ-వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబందిత అధికారులను ఆదేశించారు.

శనివారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ మీటింగు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ గుంటూరు జిల్లా నుంచి 3 బృందాలు వస్తాయని చెప్పారు. ఒక్కో బృందంలో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్, ఒక జనరల్ మెడిసన్ స్పెషలిస్ట్ తో పాటు జిల్లాకు చెందిన వైద్యాధికారితోపాటు ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉంటారన్నారు. వీరి తనిఖీలకు వీలుగా షెడ్యూల్ ను రూపొందించాలని ఆదేశించారు. వీరంతా ఆయా రోగులను, వారి మెడికల్ సర్టిఫికేట్, సదరం, ఆధార్ తదితర దృవపత్రాలను పరిశీలన చేసి, వారి వివరాలను యాప్లో నమోదు చేస్తారన్నారు. ఈ సందర్బంలో డిజిటల్ అసిస్టెంట్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమం లో బాగంగా జిల్లాలోని 1446 ఫించన్లు ను వెరిఫికేషన్ టీం ఫించన్ దారుల ఇళ్లకు వెళ్లి వారి అర్హతను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయబడుతుందన్నారు. ఈ సందర్భంగా వెరిఫికేషన్ లో సిబ్బంది తీసుకోవలసిన చర్యల పై సూచనలు చేస్తూ కచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వెరిఫికేషన్ జరగాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి పండుగకు ముందే వీలైనంత ఎక్కువమందిని పరిశీలించేలా చూడాలని సూచించారు. పింఛనాదారుల అర్హతలను, దృవపత్రాలను పరిశీలించడానికి మాత్రమే ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపడుతోందని, అర్హుల పింఛన్లు తొలగించే ఉద్దేశ్యం ఎంతమాత్రం ప్రభుత్వానికి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిశీలనచేసే వారికి ముందస్తుగానే నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఒకవేళ ఏదైనా సందర్బంలో సంబంధిత వ్యక్తి ఇంటివద్దలేని పరిస్ధితుల్లో వారిని హోల్డ్ లో ఉంచడం జరుగుతుందన్నారు.

సమావేశంలో డిఆర్డిఓ పిడి డా. ఆర్. విజయరాజు, జెడ్పీ సీఈఓ కె. సుబ్బారావు, డిఎంహెచ్ఓ డా. ఆర్.ఎం.మాలిని, డిసిహెచ్ఎస్ డా. బి.పాల్ సతీష్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఎస్. రాజు, డిపిఓ కె. అనురాధ, డిఎల్ఓ డా. నాగేశ్వరారవు, పోలీస్ శాఖ నుండి రాజ్ కుమార్, పలువురు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.