సంక్షేమ వసతి గృహాలను ఒక సమీకృత పర్యావరణ ప్రాంగణంలా తీర్చిదిద్దాలి – జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 29/08/2026

ఏలూరు, ఆగష్టు,29 : పర్యావరణ పరిరక్షణ భాగంగా జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో “నెట్ జీరో” కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం “నెట్ జీరో” కార్యక్రమంలో కింద మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ “నెట్ జీరో” కార్యక్రమం కింద జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక సమీకృత పర్యావరణ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా మొక్కలు నాటేందుకు జిల్లాలోని 51 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో గుర్తించడం జరిగిందని, 38 వేల 560 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో హరిత వృద్ధిని వేగవంతం చేసేందుకు జిల్లాలో మరింత పచ్చని, వాతావరణాన్ని రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో నిర్దేశించిన ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు ఏర్పాటుచేయడం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి “నెట్ జీరో” కార్యక్రమం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఐటిడిఏ పీఓ రాములు నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, డ్వామా పీడీ కె. వి. సుబ్బారావు, డిపిఓ మల్లికార్జునరావు, పంచాయత్ రాజ్ ఎస్ఈ జెడ్. రమేష్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ రామ్మోహన్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు.