కైకలూరు నియోజకవర్గంలో త్రాగునీరు, రోడ్లు, గృహనిర్మాణం, వివిధ శాఖల ప్రగతి, నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన సమస్యలపై రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ లు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
కైకలూరు/ఏలూరు , జనవరి, 2 : కైకలూరు నియోజకవర్గంలో త్రాగునీరు, రోడ్లు, గృహనిర్మాణం, వివిధ శాఖల ప్రగతి, నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన సమస్యలపై రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ లు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంను ముంపు ప్రమాదం నుండి రక్షించేందుకు ఉప్పుటేరుపై ఉన్న ఆక్రమణలను తొలగించి మరింత వెడల్పు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలదారులకు నోటీసులు జారీ చేసి, ఫిబ్రవరి, 1 వ తేదీ నుండి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉప్పుటేరు డ్రైన్ 12 వేల క్యూసెక్కుల నీటి విడుదల సామర్ధ్యంతో నిర్మించబడిందని, కానీ ఆక్రమణల కారణంగా 6 వేళా క్యూసెక్కుల నీటి విడుదల సామర్ధ్యానికి తగ్గిపోయిందన్నారు. దీనికారణంగా గత సంవత్సరం బుడమేరుకు వచ్చిన వరదలకు కొల్లేరు ప్రాంతం ముంపునకు గురై ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నారన్నారు. దీనికి ఉప్పుటేరు డ్రైన్ పై ఆక్రమణలను తొలగించడమే శాశ్వత పరిష్కారమని, ఈ దిశగా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సమస్య, పేదలకు గృహ నిర్మాణం వంటి ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి పరిష్కారాన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. త్రాగునీరు సమస్యలకు సంబంధించి ప్రతీ సోమవారం పీజీఆర్ ఎస్ కార్యక్రమంలో కైకలూరు నియోజకవరంనుండి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి సరఫరా పథకాలలో ఫిల్టర్ బెడ్లు మార్చాలన్నారు. మైక్రో ఫిల్టర్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. నియోజకవర్గంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపి త్రాగునీరు సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయలతో 165 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రహదార్ల పనులకు సంబంధించి 51 పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలిదిండిలో 50 లక్షల రూపాయలతో ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులను సంక్రాంతి లోపు పూర్తి చేయాలనీ, రోడ్డు నిర్మాణ పనులు,మరమ్మత్తు పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 18. 6 కోట్ల రూపాయలతో 25 కిలోమీటర్ల మేర 247 పనులు మంజూరయ్యాయని, వాటిని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టే రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలో మంజూరైన 40 అంగన్వాడీ భవనాల నిర్మాణం పనులలో కొన్ని భవనాలు ఫినిషింగ్ పనులు పూర్తి కానీ కారణంగా వినియోగంలోకి రాలేదని, వాటి పనులు వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకోవాలని డ్వామా, పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాలువలు, డ్రైన్లలో తూడు, కిక్కిస, గుర్రపుడెక్క పనులను నిర్దేశించిన సమయంలో చేపట్టి పూర్తిచేయాలని, తొలగించిన తూడు, కిక్కిస, గుర్రపుడెక్కలను కాలువలు, చెరువులు, కాల్వల గట్లపై వేయకుండా దూరంగా వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకోసం నిర్మించిన ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలు ఆ గృహాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీరు, రోడ్లు, గృహనిర్మాణ సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువలు, డ్రైన్లలో తూడు, కిక్కిస, గుర్రపుడెక్క తొలగింపు, కాలువలలో డీసిల్టింగ్ పనులను ఏప్రిల్, మే నెల నుండి చేపట్టాలన్నారు. గత సంవత్సరం బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉప్పుటేరు డ్రైన్ పై ఆక్రమణలు తొలగించి మరింత వెడల్పు చేసే పనులను వెంటనే చేపట్టాలన్నారు. కైకలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ సమయంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి 28 కోట్ల రూపాయలతో భూములను కొనుగోలు చేసారని, 26 కోట్ల రూపాయలను ఆ భూములను మెరక చేసేందుకు ఖర్చు చేసారని, ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల వాటాతో కలిపి దాదాపు 80 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన కాలనీలు మౌలిక సదుపాయాలు లేక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. సంబంధిత అధికారుల బృందంతో కమిటీ ని నియమించి కాలనీలను పరిశీలించి క్షేత్రస్థాయిలో సమస్యలు అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి తీసుకోవాలని చర్యలపై నివేదిక రూపొందించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కైకలూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాలలో భూ సమస్యలు ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తమ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసి, ప్రజల నుండి వారి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమావేశంలో ఏలూరు ఆర్డీఓ అచ్చుత్ అంబరీష్, జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ, ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యూ, పంచాయతీరాజ్ ఎస్ఈ లు జాన్ మోషే, త్రినాధ్ బాబు, రమణమూర్తి, డ్వామా పీడీ సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.