ఏపీలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పురోగతి, చేపడుతున్న చొరవపై ఏలూరు జిల్లా రెండవ స్థానం.

Publish Date : 28/08/2026

ఏలూరు, ఆగస్టు 28: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం ఆర్వోలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీప్రతినిధులతో, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వితో కలసి జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, APCPDCL CMD శ్రీ లోతేటి శివశంకర్ సమీక్షసమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2026 పురోగతి, చేపడుతున్న చొరవపై ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని, ఈ సంధర్భంగా జిల్లా యంత్రాంగంకు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో ఎన్నికలు పక్క్రియను విజయవంతం చెయ్యుటకు సంసిద్ధులుగా ఉండాలని, జిల్లా పరిశీలకులు మరియు APCPDCL CMD శ్రీ లోతేటి శివశంకర్ కోరారు.

@ ఈ సందర్భంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు తమ అభిప్రాయాలను, సూచనలను, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలియజేశారు. జిల్లా పరిశీలకులు శ్రీ లోతేటి శివశంకర్,
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంయుక్తంగా వారు లేవనెత్తిన అంశాలను నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు శ్రీ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఏలూరు క్షేత్రస్థాయిలో పోలింగు స్టేషన్లు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2026 పురోగతి, బియల్వో లు పనితీరును అధ్యయనం చేశామని, నాకు సంతృప్తి కలిగిందని అన్నారు. ఎటువంటి లోపాలు లేని ఓటరు జాబితా నిరంతరాయంగా మార్పులు, చేర్పులు చేస్తూ, అనర్హులను తొలగిస్తూ, అర్హులను జతచేస్తూ స్వచ్ఛమైన ఓటరు జాబితా సిద్ధం చెయ్యాలని అన్నారు. స్వచ్ఛమైన విధులు, సమష్టి కృషితో దోషరహిత ఓటర్ల జాబితాను సిద్ధం చెయ్యుటలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీప్రతినిధులు సహకారాన్ని అందించాలని అన్నారు. అభ్యంతరాలు గడువు ఈ నెల 30వ తేదీ వరకు ఉందని, రెండు రోజుల్లోగా వివిధ రాజకీయ పార్టీప్రతినిధులు తెలియజేయవచ్చునని అన్నారు. అక్టోబరు 03న ఓటర్ల తుది జాబితా ప్రచురణే లక్ష్యంగా జిల్లాయంత్రాంగం నుండి బియల్వో వరకు మనస్సు పెట్టి పనిచెయ్యాలని ఇందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీప్రతినిధులు సహకారం, సమన్వయం చాలా అవసరమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2026 ప్రత్యేక దృష్టిపెట్టామని, క్షేత్రస్థాయిలో పరిశీలన, సంబంధిత అధికారులతో సమీక్షసమావేశాలు, క్రమం తప్పకుండా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఏపీలో రెండవస్థానంలో నిలిచామని ఎంతో ఆనందం, స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకారం ఎంతో అమూల్య మైనదని ఈ సందర్భంగా వారిని అభినందించారు. మేజరు ఇబ్బందులు ఎక్కడ తలెత్తలేదని, అయితే పేర్లలో చిన్నచిన్న తప్పులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఫారం 06 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి యం.శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవో లు కె.లక్ష్మీప్రసన్న, యం.వి.రమణ, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, వి.వి.యస్.శర్మ, యస్సి కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, ఏఇ ఆర్వోలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీప్రతినిధులు సిపిఐ (యం) యస్.సత్యనారాయణ, యం.ఇసాకు, బియస్పి ఏ.రతన కాంత్, టీడీపీ కె.అచ్యుతబాబు, వైఎస్ఆర్సిపి పార్టీ వి.స్టాన్లీ బాబు, యల్.వి.సుభాష్, తుమరాడ స్రవంతి, ఐయన్సి ఆర్.రామచంద్ర రావు, బిజెపి నెరుసు నెలరాజ, గాది రాంబాబు, అనిల్ ఆచార్య, జనసేన తాతపూడి రామ్ చందు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.