పర్యావరణం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి.
ఏలూరు, ఆగస్టు 25: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం “సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) కాంప్లెక్స్‌ను నిర్మాణం మరియు మొదటి ఫేస్ లో 20 ఎకరాలు భూమి లీజుకొరకు “జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, రిలయన్స్ ప్రతినిధులు బృందం, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మొదటి విడత 20 ఎకరాలు భూమిలీజు, రెండవ ఫేసులో 4 వేలు నుండి 5 వేలు ఎకరాలు భూసేకరణ, తదితర అంశాలుపై జిల్లా కలెక్టరు సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏపిలోనే మనజిల్లాలో భారత దేశపు మొట్టమొదటి సమీకృత భూగర్భ బొగ్గువాయువు ఉత్పత్తి (UCG) కాంప్లెక్స్ నిర్మాణం శుభపరిణామం అన్నారు. ముందుకు వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి మొదటి ఫేసులో పరీక్షలకు 20 ఎకరాలు భూమిలీజు కొరకు రైతులకు అవగాహన కలిగించాలని, గురువారం నుండి డ్రోన్ సర్వేపనులు మొదలు పెట్టాలని సర్వేసహాయక సంచాలకులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. చింతలపూడి మండలం రేచర్ల, శెట్టివారిగూడెం రెండు బొగ్గు బ్లాకులను వినియోగించుకుంటారని అన్నారు. రెండవ ఫేస్ లో 4 వేలు నుండి 5 వేలు ఎకరాలు భూమికి భూసేకరణ సిద్ధంగా ఉండాలని అన్నారు. రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు బృందం అవసరమైన టార్గెట్స్ ను, సంబంధిత శాఖలు అధికారులు క్షేత్రస్థాయిలో సాధ్యసాద్యాలను పరిశీలించి, పూర్తిస్థాయి నివేదిక అందించాలన్నారు. ప్రాజెక్టు కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌళిక వసతులు, విద్యుత్తు, నీటివసతి, రహదారులు, పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలుపై అధికారులు, కంపెనీ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. ప్రాజెక్టు అమలులో వివిధ శాఖలు మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భూగర్భంలో ఉన్న బొగ్గును వాయువుగా మార్చి వినియోగించే UCG సాంకేతికతకు భవిష్యత్తులో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందన్నారు. ఏలూరు జిల్లాలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు, స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అనుమతులు, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చెయ్యాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు వలన మిగతా నీటి ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు, రైతులు వివిధ పంటలకు పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని నిబంధనలు, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు బృందం సభ్యులు, పొల్యూషన్ బోర్డు ఇఇ ఏ.శ్రీరామచంద్రమూర్తి, జిల్లా పరిశ్రమలు కేంద్రం జియం కె.వెంకటరావు, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, విద్యుత్తు శాఖ యస్ఇ యం.అంబేద్కర్, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి.వి.కె.మల్లిఖార్జునరావు, జిల్లా గ్రౌండు వాటరు డిడి పైలా కోదండరామ్, సర్వే సహాయక సంచాలకులు అన్సారీ, సంబంధిత శాఖలు అధికారులు, ఆయా మండల తహశీల్దారులు, మండల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.