ఆగష్టు,1వ తేదీన సామజిక పెన్షన్లను పకడ్బందీగా పంపిణీ చేయండి-అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

ఏలూరు, జూలై , 29 : పీ4 కార్యక్రమంలో మార్గదర్సులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్చందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పీ4 కార్యక్రమం, సామజిక పెన్షన్ల పంపిణీపై మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో మార్గదర్సకుల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. మండల పరిధిలో పారిశ్రామికవేత్తలను గుర్తించి పీ4 కార్యక్రమంలో వారిపై ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్చందంగా పాల్గొనేలా చూడాలన్నారు. ముందుగా మండల పరిధిలో పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు మార్గదర్సులుగా ఉండే పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల వారిని గుర్తించి, వారికి పీ4 కార్యక్రమం సదుద్దేశ్యంను వివరించాలన్నారు. మార్గదర్సులుగా గుర్తించిన వారిని పీ4 వెబ్సైట్ నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మార్గదర్సులు దత్తత తీసుకునే బంగారు కుటుంబాల వివరాలు కూడా ఆన్లైన్ లో నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమాజ సేవకు ముందుకు వచ్చే మార్గదర్సులను గుర్తించి వారు ఆన్లైన్ లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్సులకు తెలియజేసి, వారు దత్తత తీసుకునే కుటుంబాలను అనుసంధానం చేయాలన్నారు. అనుసంధానం చేసిన బంగారుకుటుంబాలకు అవసరమైన చేయూత అవసరాలను మార్గదర్శకులు తెలియజేయాలన్నారు. ఆగష్టు, 1వ తేదీన సామజిక పెన్షన్ పంపిణీని లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి అందించాలన్నారు. పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించేలా చూడాలన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన సామజిక పెన్షన్ల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలన్నారు.
టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా ముఖ్యప్రణాళికాధికారి వాసుదేవరావు, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, డిఈ ఓ వెంకటలక్ష్మమ్మ, వ్యవసాయాధికారి హబీబ్ భాషా , ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.