ఏలూరు జిల్లాను కుష్ఠువ్యాధిరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ఈనెల 17 నుండి 30వ తేదీ వరకు జిల్లాలో ఇంటింటి సర్వే చేపట్టాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, నవంబర్, 12 : ఏలూరు జిల్లాను కుష్టువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం కుష్టువ్యాధి గుర్తింపు మరియు నిర్ధారణకు ప్రత్యేక కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో కుష్ఠువ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి
కుష్ఠువ్యాధిపై ప్రత్యేక సర్వే నిర్వహించాలన్నారు. కుష్టువ్యాధి వ్యాప్తికి కారణాలు, వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించేలా డివిజన్, మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరితగతిన వ్యాధి నుండి బయటపడడమే కాక ఇతరులకు వ్యాపించకుండా కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. జిల్లాలో కుష్టువ్యాధిగ్రస్తులు ఎక్కువగా గుర్తించిన ప్రాంతాన్ని గుర్తించి, అందుకుగల కారణాలను విశ్లేషించి, వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి వ్యాధిగ్రస్తులు నుండి తుమ్మడం, దగ్గడం వలన ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయన్నారు. ఒంటిపై స్పర్శ లేని మచ్చలు కానీ, ముఖం, చెవులు, ఎద , వీపుపై నొప్పిలేని బుడిపెలు, తదితర లక్షణాలు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 3 నుండి 5 సంవత్సరాలు పడుతుందన్నారు. కుష్ఠువ్యాధిని మల్టీ డ్రగ్ థెరఫీ విధానం ద్వారా పూర్తిగా నివారించన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎం.డి.టి. మందులు పూర్తి ఉచితంగా లభిస్తాయన్నారు. వైద్యునిచే వ్యాధి నిర్ధారణ ఐన తరువాత మొదటి నెల వైద్యుని వద్ద, రెండవ నెల నుండి ఏ .ఎన్ .ఎం. ద్వారా ఇంటి వద్దనే మందులు తీసుకుని క్రమం తప్పకుండా వాడాలన్నారు.
ఈ సందర్భంగా కుష్టువ్యాధి నివారణపై ముద్రించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.జె. అమృతం, జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, డి.ఆర్. డి. ఏ ., పీడీ ఆర్. విజయరాజు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఐ సి డి ఎస్ పీడీ శారద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.