ఏలూరు నగరంలోని కాలువలు, నీటివనరులు వ్యర్ధాలతో కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్ ను ఆదేశించారు.

ఏలూరు, జూన్, 21 : ఏలూరు నగరంలోని కాలువలు, నీటివనరులు వ్యర్ధాలతో కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్ ను ఆదేశించారు. ఏలూరు నగరంలోని పలు ప్రాంతాలలోని కాలువలు, నీటివనరుల వద్ద పారిశుద్ధ్య పరిస్థితులను శనివారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని తమ్మిలేరు గట్లను కలెక్టర్ పరిశీలించారు. తమ్మిలేరు గట్లకు ఇరువైపులా కొబ్బరిబోండాల వ్యర్ధాలు, హోటల్స్ వ్యర్ధాలతో అపరిశుభ్రంగా ఉండడంపై మునిసిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్తను వేసే కళ్యాణమండపాల యజమానులు , మార్కెట్లు, హోటల్స్, రెస్టారెంట్లు, వాణిజ్య దుకాణాదారులు, ప్రజలకు నోటీసులు జారీ చేసి, పెనాల్టీలు విధించాలన్నారు. ఈ విషయాన్నీ ప్రతీ ప్రధాన కూడలిలో అందిరికీ తెలిసేలా బ్యానెర్లు ఏర్పాటుచేయాలన్నారు. తాను నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, రోడ్డులపై ఎక్కడైనా కనిపిస్తే సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.