ఓటర్ల ప్రభావితం చేసే చర్యలపై నిఘా పెట్టాలి: అధికారులకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశం

ఏలూరు, నవంబర్, 21 : జిల్లాలో డిసెంబర్, 5వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్, 5వ తేదీన జిల్లాలోని 20 పోలింగ్ కేంద్రాలలో జరుగుతాయన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్, 9వ తేదీన జరుగుతుందని, 12వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో జిల్లాలో ఎక్కడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా అధికారులు చూడాలన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ నియోజవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు 2605 మంది ఓటర్లు ఉన్నారని, 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల నిర్వహణకు 144 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలు అన్నింటిలోనూ కనీస వసతులు కల్పించడం జరిగిందన్నారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడి ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నిర్వహణ, భద్రతా చర్యలపై సంబంధిత మండల తహసీల్దార్లు తమ పరిధిలో సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి నిర్దేశించిన తేదీలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఓటర్లను ప్రలోభ పరిచే చర్యలు ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను గుర్తిస్తే వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పోలింగ్ నకు 48 గంటల ముందు నుండి మద్యం అమ్మకాలు నిలిపివేయాలన్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయ నియోజవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎటువంటి శాంతి భద్రతలకు ఎటువంటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో బందోబస్త్ ఏర్పాట్లు చేశామన్నారు. అనధికార వ్యక్తులు పోలింగ్ బూత్ లోనికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత 10 సంవత్సరాలలో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు సమస్యలు కలిగించిన వారిని గుర్తించి, వారి కదలికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు.
సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ లు అచ్యుత్ అంబరీష్, వాణి , ఎం.వి. రమణ, ఎల్డిఎమ్ నీలాద్రి, డీఆర్డీ ఏ పీడీ విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ, ప్రభృతులు పాల్గొన్నారు.