కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగినప్పుడే సదరు కార్యక్రమం ఉద్దేశ్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
ఏలూరు, అక్టోబర్, 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగినప్పుడే సదరు కార్యక్రమం ఉద్దేశ్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక గిరిజన భవన్ లో సోమవారం సాయంత్రం పండుగ వాతావరణంలో జరిగిన హేలాపురి ఉత్సవాలు…గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జీఎస్టీ ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలన్నారు. హేలాపురి ఉత్సవాలు…షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ముందుగా సర్. సి.ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, సోమవారం వచ్చిన భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా గిరిజన భవన్ లో నిర్వహిస్తున్నామని, వాతావరణంలో మార్పు వచ్చిన తరవాత తిరిగి సర్. సి.ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ పై గత మూడు వారాలుగా జిల్లాలో అన్ని శాఖలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. షాపింగ్ ఉత్సవంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ప్రజలకు అవసరమైన వస్తువుల స్టాల్స్ ను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ప్రజలను మరింత ఉత్సాహపరిచేందుకు హేలాపురి ఉత్సవం సమయంలో అధిక మొత్తంలో షాపింగ్ చేసిన వారి పేర్లను ఉత్సవం చివరి రోజున డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ తాము కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 8వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచేలా జీఎస్టీ రేట్లను తగ్గించిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ సంస్కరణలపై ఏలూరు జిల్లా ప్రజలలో పూర్తిస్థాయిలో అవగాహన కలిగిందన్నారు. తాను ఈ కార్యక్రమ ప్రాంగణంలో కొంతమంది ప్రజలను జీఎస్టీ సంస్కరణలపై అడిగానని, వారు చక్కగా జవాబు చెప్పారన్నారు.
కార్యక్రమంలో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఉప రవాణా కమీషనర్ షేక్ కరీం, ఏలూరు నగరపాలక కమీషనర్ ఏ . భానుప్రతాప్, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ జి. నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.