గంజాయి, డ్రగ్స్ రవాణా అరికట్టేందుకు విస్తృతంగా చెక్ పోస్ట్ లు-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, ఆగష్టు, 7 : జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో గౌతమీ సమావేశపు హాలులో బుధవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలనీ, గంజాయి, డ్రగ్స్ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, హై వే లలో టోల్ ప్లాజా ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్ వినియోగం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ పంపిణీ చేసే పెడ్లర్స్ ను గుర్తించి వారిపై కఠిన కేసులు నమోదు చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం కూడా శిక్షార్హమేనని, గంజాయి, డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్ సరఫరాపై 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. 14500 టోల్ ఫ్రీ నెంబర్ ను అన్ని పాఠశాలలు, కళాశాలల్లోని, ప్రముఖ రోడ్ల కూడళ్లు ప్రదర్శించాలన్నారు. పోలీస్,విద్య, మెడికల్, అధికారులతో ప్రత్యేక బృందంగా ఏర్పాటుచేసి పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన శిక్షలు పై విస్తృత అవగాహనకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, నాటు సారా అమ్మకాలు, రవాణాపై పెద్ద ఎత్తున నిఘా పెట్టామన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. , ఇప్పటివరకు 149 కేసులు నమోదు చేయడమైనది, 540 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి దామా, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, డి ఈఓ అబ్రహం,ఆర్ ఐ ఓ చంద్రశేఖర్, ఉప రవాణా కమీషనర్ శాంతికుమారి, డిసిహెచ్ ఎస్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. నాగేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.