Close

గోపన్నపాలెం ఎస్.ఎస్.ఆర్. ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..

Publish Date : 06/05/2025

ఏలూరు/దెందులూరు, మే, 6: దెందులూరు మండలం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, కలెక్టర్ కె. వెట్రి సెల్వి మంగళవారం పరిశీలించారు. కళాశాలకు విచ్చేసిన వారికి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియేలు, దెందులూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, కళాశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలోనే ఏకైక వ్యాయామ విద్య కళాశాల గోపన్నపాలెం లో ఉందని దీని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ప్రిన్సిపల్ నతానియేలు కళాశాలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారులకు వివరించారు. ఫీజులు తక్కువగా ఉండటం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ ,బీసీ విద్యార్థులు ఈ కళాశాలలో చేరతారన్నారు. వీరికి ప్రత్యేకంగా హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరారు. గతంలో కారుకోట డిగ్రీ కళాశాలకు ఇదేవిధంగా సౌకర్యం కల్పించడం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలిగిందని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి మంత్రి కొలుసు పార్థసారథి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో చరవాణిలో మాట్లాడారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను బాలికలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ బాలికల వసతి గృహానికి సంబంధించి కోటి రూపాయలు నిధులు ఎంపీ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్, తాగునీరు ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, తహశీల్దార్ బి. సుమతి, యంపిడివో శ్రీదేవి, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామ సీత, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్. మహేష్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, డి ఎస్ డి ఓ శ్రీనివాసరావు, కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.