Close

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

Publish Date : 22/01/2025

ఏలూరు,జనవరి 22: ఇంటింటి సర్వేలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని, వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కుష్టు వ్యాధిపై ప్రచురించిన అవగాహన పోస్టర్లు, కరపత్రాలను బుధవారం స్థానిక కలెక్టరేట్‌ లో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఫిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ‘‘కుష్టు’’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాడంలో భాగస్వామ్యం కావాలన్నారు.
కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వ పరంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న రోగులను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సహాయం అందించగలిగితే వ్యాధిని త్వరితగతిన నివారించ వచ్చునన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఫిబ్రవరి 2వ తేది వరకు మెడికల్‌ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చర్మంపై స్పర్శ, నొప్పి, దురదలేని మచ్చలు, చెవులపై, వీపుపై, ఎదపై నొప్పిలేని బుడుపులు, నొప్పిగావున్న నరములపై లక్షణాలకు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించబడుతుందన్నారు.
కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. మాలిని, జిల్లా కుష్టువ్యాధి నివారణ అధికారి డా. ఎమ్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.