జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్ష.. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

ఏలూరు,జూన్,20: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ, తదితర సమస్యలను అధిగమించి త్వరితగతిన రహదారుల నిర్మాణం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం పలు జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణకు సంబంధించి సంబంధిత అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టిసీమ-జీలుగుమిల్లి 365 బి.బి. 40 కి.మీ. రహదారికి సంబంధించి త్వరగా భూసేకరణ చేసి నిర్మాణ దారులకు స్వాధీనం చేయాలని ఆదేశించారు. మిగిలిన రైతులను సమన్వయంచేసి భూమి సేకరించి సకాలంలో నష్టపరిహారం అందించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి తహశీల్దార్లను ఆదేశించారు. అదే విధంగా ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సంబంధించి ఆయా అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబధించి రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని కొవ్వూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. కొయ్యిలగూడెం పరిధిలోని రైతులకు పరిహారం చెల్లించి రోడ్డునిర్మాణానికి అవసరమైన భూమిని నిర్మాణదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎన్.హెచ్. ప్రాజెక్ట్ డైరెక్టర్ ను ఆదేశించారు. పామర్రు, ఆకివీడు 165 జాతీయ రహదారికి సంబంధించి గోనేపాడు వద్ద ఆర్వోబి నిర్మాణానికి అవసరమైన భూమి విషయంలో రైతులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏలూరు ఆర్డిఓ, కైకలూరు తహశీల్దారను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, ఎన్.హెచ్ అధికారులు పలువురు తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.