జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి

ఏలూరు, ఆగష్టు, 26 ; హెచ్ ఐ వి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధింత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 8680 మందికి హెచ్ ఐ వి వ్యాధిగ్రస్తులుగా గుర్తించారని, వారికి ఆ వ్యాధి ఎవరి నుండి సోకిందో మూల కారణాలను తెలుసుకుని, వారికి కూడా ఏ ఆర్ టి చికిత్స అందించినప్పుడే వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమన్నారు. హెచ్ ఐ వి వ్యాధిగ్రస్తులు చికిత్సను మధ్యలో చికిత్స మానివేయకుండా తప్పనిసరిగా చికిత్స కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ ఐ వి వ్యాధి వ్యాప్తికి గల కారణాలపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కలిగించాలని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో హెచ్ ఐ వి వ్యాధి వ్యాప్తికి గల కారణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవగాహన ద్వారానే హెచ్ ఐ వి వ్యాప్తిని అరికట్టగలమని, యువతలో HIV/AIDS గురించి అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి పాఠశాల, కళాశాలల స్థాయిలో రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఏర్పాటుచేసి సురక్షిత రక్తదానం ప్రోత్సహించడం, హెచ్ ఐ వి వ్యాధిపట్ల యువతలో ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన పెంచాలన్నారు. హెచ్ ఐ వి పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని, హెచ్ ఐ వి సోకినవారుగా గుర్తించిన వారికి ఏ ఆర్ టి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ ఐ వి కలిగిన గర్భిణీ నుండి శిశువుకు వ్యాధి సోకకుండా అవసరమైన చికిత్స అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వైద్య శాఖాధికారి డా. పి .జె. అమృతం,ఐసిడిఎస్ పీడీ శారద, జిల్లా పరిశ్రమల శాఖాధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాసరావు, బాల సంక్షేమాధికారి సూర్యచక్రవేణి, పర్యాటకాభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.
అనంతరం హెచ్ ఐ వి వ్యాధి నియంత్రణపై ముద్రించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.