Close

తుఫాన్ తీవ్రతపై ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష

Publish Date : 25/10/2025

ఏలూరు, అక్టోబర్, 25 : జిల్లాలో ‘మొంథా తుఫాన్’ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించి తుఫాన్ ముందస్తు చర్యలపై అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ‘మొంథా తుఫాన్’ కారణంగా ఏలూరు జిల్లాలో ఈనెల 28, 29 తేదీలలో తీవ్రమైన గాలులు వీస్తాయని , భారీ వర్షాలు కురుస్తాయని, తీవ్రగాలులకు హోర్డింగ్లు, స్థంబాలు, బలహీనంగా ఉన్న చెట్లు, శిధిలావస్థలో భవనాలు, పూరిళ్లు వంటివి కూలిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, వీటి కారణంగా ఎటువంటి ప్రాణ నష్టాలు సంభవించకుండా అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లు, స్తంభాలను, బలహీనంగా ఉన్న చెట్లు తొలగించాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలు, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తీవ్రగాలులు కారణంగా ఆస్బెస్టాస్, ఐరన్ రేకులు ఎగిరిపోయి అవకాశం ఉందన్న హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నదులు, చెరువులలోనికి ప్రజలెవ్వరూ ఈత కు వెళ్లకుండా, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి పరిశీలించాలన్నారు. కొల్లేరు లంక ప్రాంతాలలోని ప్రజలు చేపలవేటకు వెళ్లకుండా ఆయా గ్రామాలలో ప్రజలకు తెలియజేయాలన్నారు. ‘మొంథా తుఫాన్’ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలపై పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమాచార వ్యవస్థ స్తంభించకుండా టెలికాం టవర్ల వద్ద జనరేటర్లు సిద్ధం చేయాలనీ, వాటి ఏర్పాట్లను సంబంధిత మండల తహసీల్దార్లు తనిఖీ చేయాలన్నారు. ‘మొంథా తుఫాన్’ ప్రమాదం ముంపు తొలగే వరకు జిల్లాలో అధికారులు, సిబ్బంది వారి ప్రధాన కార్యస్థానాలలోనే ఉండాలని, ప్రజలకు అవసరమైన సేవలందించాలన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేసి, సిబ్బందిని నియమించాలన్నారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసే ప్రజలకు సహాయం అందించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణీలను దగ్గరలోని పిహెచ్సి లకు తరలించాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలోని గర్భిణీలు, విభిన్న ప్రతిభావంతులు, చిన్న పిల్లలు, వయోవృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కల్వర్టులు, కాజ్ వే లు, వాగులను ప్రజలు దాటకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి, సిబ్బందిని నియమించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తూఫాన్ అనంతరం వరద నీరు పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం త్రాగునీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వరద తుఫాన్ ప్రమాదం ముగిసే వరకు అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవలు మంజూరు చేయడం జరగదని, సెలవులో ఉన్నవారికి సెలవు రద్దు చేయడం జరిగిందని, వారు వెంటనే విధులకు హాజరు కావాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ లు అచ్యుత్ అంబరీష్, రమణ, సర్వే శాఖ ఏ డి అన్సారీ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.