తుఫాన్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై గ్రామ సచివాలయాలు పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరు, అక్టోబర్, 27 : ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న శిధిల భవనాలలో ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం తుఫాన్ పరిస్థితిపై జిల్లా అధికారులు,నియోజకవర్గ,మండల, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఒక్క ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని, తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా శిధిలావస్థలో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలను వెంటనే వారి బంధువుల ఇంటికి గాని, లేదా ప్రభుత్వం ఏర్పాటుచేసిన సహాయక శిబిరాలకు గాని తరలించాలన్నారు. తుఫాన్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై ప్రతీ గ్రామ/వార్డ్ సచివాలయాలు పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తుఫాన్ ప్రభావిత గ్రామాలలో తుఫాన్ సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.