Close

ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరిక

Publish Date : 19/11/2024

ఉంగుటూరు , నవంబర్, 19: ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మంగళవారం విస్తృతంగా పర్యటించి వ్యవసాయం, అనుబంధ రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంవర్థకం, అక్వా రంగాల క్షేత్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేబ్రోలులో అగ్రి ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రైతులు కలెక్టర్ ని కలిసి, ధాన్యం సేకరణలో తేమ శాతం లెక్కింపులో కొంతమంది మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ ధాన్యం సేకరణ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని, రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకుని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గోనెసంచులకు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, ఈ రైతుకైనా చిరిగిపోయిన గోనెసంచులు వస్తే వెంటనే దగ్గరలోని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం చేబ్రోలులో గోడౌన్ లో ఉంచిన గోనెసంచులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కేంద్రంలో మొక్కను నాటారు.
అనంతరం బాదంపూడిలోని చేపపిల్లల పెంపక కేంద్రాన్ని సందర్శించి వివరాలను మత్యశాఖాధికారిని అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, అసిస్టెంట్ డైరెక్టర్ ఉష రాజకుమారి, మత్య్సశాఖ జాయింట్ డైరెక్టర్ నాగలింగాచార్యలు, తహసీల్దార్ వై. పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపిడిఓ గంజి రాజ్ మనోజ్ , ప్రభృతులు పాల్గొన్నారు.