Close

పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి చెప్పారు.

Publish Date : 04/07/2024

ఏలూరు, జులై, 4 : పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ కార్యాలయాలలో పనిచేసే మహిళలు ఇంటివద్ద బయలుదేరిన దగ్గర నుండి కార్యాలయం చేరుకొని, విధులు నిర్వర్తించి, అనంతరం ఇంటికి వెళ్లే వరకు ఎన్నో విధాలుగా వేధింపులకు గురవుతున్నారన్నారు. మహిళల హక్కుల పరిరక్షణలో భాగంగా పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి 2013వ సంవత్సరంలో ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు నలుగురు సభ్యులతో ఏర్పాటుచేయాలని, వారిలో కనీసం ఇద్దరు మహిళలను కూడా సభ్యులుగా నియమించాలన్నారు. కార్యాలయాలలో మహిళలపై లైంగిక వేధింపులు జరిపే వారిపై తీవ్రమైన చర్యలుంటాయన్నారు. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ చట్టంపై మహిళలకు స్పష్టమైన అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ చట్టం అమలుకు సంబంధించి చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు, ఫిర్యాదు ఎవరికీ, ఏ విధంగా చేయాలి, బాధిత మహిళల నుండి ఫిర్యాదు తీసుకోవడం, ఫిర్యాదుపై తదుపరి చర్యలు, ఫిర్యాదుపై విచారణకు కమిటీని ఏర్పాటుచేసి, విచారణ అనంతరం వేధింపులు చేసిన వ్యక్తిపై తీసుకోవలసిన చర్యలపై నివేదిక అందించడం, ఫిర్యాదుదారులో ఆత్మస్థైర్యం కలిగించడం, తదితర చర్యలపై కమిటీ సభ్యులకు, ఉద్యోగులకు అవగాహన కలిగించాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా సంబంధిత కమిటీలు పనిచేయాలన్నారు. . కార్యాలయాలలో పనిచేసే మహిళలు ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించే వాతావరణాన్ని కార్యాలయంలో కలిగించేందుకు కమిటీలు కృషి చేయాలన్నారు.
అదనపు ఎస్పీ స్వరూపరాణి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నేరం రుజువైతే సంఘటన తీవ్రత ననుసరించి జరిమానా, జైలు శిక్ష లేదా నిందితుడిని ఉద్యోగంలోనుండి కూడా తొలగించవచ్చన్నారు.
రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ కూనా కృష్ణారావు మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులపై భారతీయ శిక్షాస్మృతి లో చట్టాలను వివరించారు.
ఈ సందర్భంగా సదరు చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ముద్రించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. పోస్టర్ ను ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రదర్శనకు ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, , ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి,డి ఆర్ డి ఏ పీడీ ఆర్. విజయరాజు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ప్రకాశరావు, జిల్లా బి.సి., సంక్షేమ శాఖాధికారి నాగరాణి, ఐసిడిఎస్ పీడీ పద్మావతి, జిల్లా విద్యా శాఖాధికారి అబ్రహం, జిల్లా ఆసుపత్రిసేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, డి ఐ ఓ డా. నాగేశ్వరరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకట కృష్ణ, నగరపాలక సంస్థ వైద్యాధికారి డా.మాలతీ ప్రభృతులు పాల్గొన్నారు.