ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబోధనలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.

ఏలూరు/బుట్టాయిగూడెం, జులై 03: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబోధనలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం బుట్టాయిగూడెం మండలం రామనర్సాపురంలో ప్రభుత్వ పాఠశాల అంగన్ వాడీ కేంద్రాల పనితీరును కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రతి పేదకుటుంబం పేదరికం నుండి వచ్చేందుకు తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలని కలెక్టర్ అన్నారు. పిల్లల తరగతి గదికి వెళ్లి పిల్లలకు అందిస్తున్న విద్యాబోధనలపై ఆరా తీశారు. పిల్లలతోటి కలెక్టర్ స్వయంగా తరగతిలోని బ్లాక్ బోర్డుపై లెక్కలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి పిల్లల నుంచి జవాబులను రాబట్టారు. అలాగే పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్నం భోజన పధకం, స్కూలు యూనిఫారాలు, ఉచిత పుస్తకాల పంపిణీ, త్రాగునీరు, తదితర అంశాలపై సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని పాఠశాల పరిశుభ్రతకు అధిక ప్రాదాన్యతనివ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం గ్రామ ప్రజలతో వారి సమస్యలను పాఠశాల, అంగన్వాడీ కేంద్రం పనితీరును, పారిశుధ్యం నిర్వహణ, వైద్యసేవలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలతో మమేకమై వారినుండి సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రతి తల్లిదండ్రలు తమ పిల్లలకు ఇచ్చేది తరగనిఆస్ధి విద్యేనని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. పిల్లలను బాలకార్మికులుగా కాకుండా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలియజేశారు. ఈ తనిఖీలో పాఠశాలలో పారిశుధ్యాన్ని పరిశీలించారు. తదుపరి రాజానగరం గ్రామంలోని జిటిడబ్య్లూ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని కలుషితమైన త్రాగునీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని, వేడి ఆహార పదార్ధాలను ఎప్పటికప్పుడు పిల్లలకు అందించాలని, నాణ్యతగల విద్యతోపాటు ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లలకు విద్యాబోధనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట పివో ఐటిడిఎ యం. సూర్యతేజ, ఆర్డిఓ కె. అద్దయ్య, మండల తహశీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.