Close

బిసి లోన్ల అర్హుల జాబితాను వెంటనే బ్యాంకులకు పంపాలి: ఎంపిడిఓ లకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

Publish Date : 03/04/2025

ఏలూరు, ఏప్రిల్, 3 : జిల్లాలో స్వయం ఉపాధి పధకాల ఏర్పాటుకు రుణాల కోసం వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు కార్పొరేషన్ ద్వారా యువత చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రుణాల మంజూరు కోసం వెంటనే బ్యాంకులకు పంపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎంపిడిఓ లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం ఎంపిడిఓ లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వయం ఉపాధి పధకాల నిమిత్తం వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వారు, కాపు కార్పొరేషన్, తదితర పథకాల ద్వారా జిల్లాలో 30 వేల 436 మంది యువత మార్చి , 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. అందిన దరఖాస్తులను బ్యాంకర్ల తో కలిసి పరిశీలించి, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు అర్హులైన వారి జాబితాను వెంటనే బ్యాంకర్లకు పంపి రుణాలు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ ఎంపిడిఓ లను ఆదేశించారు. బ్యాంకర్ల నుండి వెంటనే రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుని, స్వయం ఉపాధి యూనిట్లను లబ్ధిదారులు ఏర్పాటుచేసుకునేలా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. రుణాల మంజూరులో బ్యాంకర్ల నుండి ఏమైనా సమస్య ఏర్పడితే వెంటనే ఎల్డిఎమ్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపిడిఓ లను, అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

బిసి. కార్పొరేషన్ ఈడీ పుష్పలత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి నాగరాణి, డిపిఓ అనురాధ, ఎల్డిఎమ్ నీలాద్రి, ప్రభృతులు పాల్గొన్నారు.