మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మార్చి, 5: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8 న ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్యుల చాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో ముందస్తు ఏర్పాట్లపై ఆమె సమీక్షా సమాశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా “లక్ పతి దీదీస్” అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వంద మంది మహిళా ఎంట్రెప్రెన్యూర్లను ముఖ్య మంత్రి సత్కరించనున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వంద చేనేత మహిళా కళాకారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబోతున్నట్టు తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన స్టాళ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద దాదాపు 1300 మంది అర్హులైన మహిళలకు రూ.1,300 కోట్ల మేర రుణాలను అందచేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఆరోజు, పార్లమెంట్ సభ్యులను స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఆధ్వర్యంలో పై కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హాజరయ్యారు.