ముసునూరు మండలంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి సుడిగాలి పర్యటన… భారీ వర్షాలు, వరదలు ప్రభావత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి…
ముసునూరు/నూజివీడు/ఏలూరు,సెప్టెంబరు,10: భారీ వర్షాలతో తలెత్తిన సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు మంగళవారం ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్బంగా ముసునూరు, చింతలపల్లి, గోగులంపాడు, చెక్కపల్లి, గ్రామాల్లో పర్యటించి భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగా రహదారులకు యుద్ధప్రాతిపధికన తాత్కాలికంగా రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యానికి అనువుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ముసునూరులో రైతులకు వెళ్లే రహదారుల్లో వాగుల నుండి వచ్చే వరదనీరు తూముల ద్వారా వెళ్లుటకు అవసరమైన చోట్ల కొత్తవి నిర్మాణానికి ప్రతిపాధనలు తయారుచేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజి వ్యవస్ధ, వైద్య సేవలు, ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా రేషన్ పంపిణీ, తదితర అంశాలపై మంత్రి ప్రజల నుండి అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు. అదే విధంగా మండలంలోని రైతాంగానికి మినుము, పత్తి పంటల నష్టానికి సంబంధించిన నివేదికలను తయారు చేసి సిద్ధం చేయాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్యం పనులు చేపట్టాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. చెక్కపల్లి గ్రామంలో ఉన్న చెరువు వర్షపునీటితో నిండివుండటం వల్ల వాటిని బయటకు పంపడానికి చెరువు గట్టును అధికారులతో కలిసి మంత్రి పరిశీలించడం జరిగింది.
గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి దర్శించుకున్నారు.
వీరివెంట పశుసంవర్ధక శాఖ జెడి జి. నెహ్రూబాబు, తహశీల్దారు రాజ్ కుమార్, ఆర్అండ్ బి డిఇ బాబూరావు, ఎఇ అశోక్ బాబు, ఇవోపిఆర్డి ఎస్.వి. శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, స్ధానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.