వరద పునరావాస కార్యక్రమాలలో అలక్ష్యానికి తావులేదు ప్రాణ, పశు నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ఏలూరు, జూలై , 11 : జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికపై తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతిపై తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం సాయంత్రం సంబంధింత అధికారులతో కలెక్టర్ అత్యవసర టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక ముంపు ప్రాంతాలలైనా కుక్కునూరు మండలం లచ్చిగూడెం, గొమ్ముగూడెం గ్రామ ప్రజలను తక్షణమే దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లను యుద్దప్రాతిపదికన సిద్ధంగా ఉంచాలన్నారు. ఇదే సమయంలో రెండవ ప్రమాద హెచ్చరిక ప్రభావితమయ్యే ముంపు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా నిండు గర్భీణీలను, వయోవృద్ధులను, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని సమీప సిహెచ్ సి లకు తరలించాలన్నారు. వరదల మూలంగా ఎటువంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పునరావాస కార్యక్రమాలలో భాగంగా పునరావాస కేంద్రంలో విద్యుత్ సౌకర్యం, జనరేటర్ అందుబాటులో ఉంచాలన్నారు. త్రాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కేంద్రంలో వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరం మేరకు కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు మార్కెటింగ్ శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద సహాయ పునరావాస కార్యక్రమాలకు అవసరమైన టార్పాలిన్లు, బోట్లు , లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లను, మంచి సామర్ధ్యం కలిగిన సిబ్బందితో కూడిన రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిపిఓ ను కలెక్టర్ ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ, ఐ. టి.డి. ఏ ప్రాజెక్ట్ అధికారి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వరద నీరు ప్రవహించే కల్వర్టులు, కాజ్ వె లు, రహదారులను ముందస్తుగా మూసిఉంచడంతోపాటు ప్రజలు దాటకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.