Close

వరద ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 30/09/2025

ఏలూరు, సెప్టెంబర్, 30 : గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితిపై తీసుకోవలసిన చర్యలపై మంగళవారం అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిందని, మూడవ ప్రమాద హెచ్చరిక కు చేరవచ్చన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో అధికారులందరూ అప్రమత్తం ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముఖ్యంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలను వెంటనే తరలించాలన్నారు. వరద ముంపు ప్రభావిత గ్రామాలలోని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. వరదల కారణంగా పాముకాట్లు సంభవించే అవకాశం ఉన్నందున, పిహెచ్సి లో సాధారణ పాముకాటు మందులు వంటివి తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ ని కలెక్టర్ ఆదేశించారు. పిహెచ్సి వైద్యుల ఆందోళన వైద్య సేవలపై పడకుండా, ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాలలోని ప్రజలకు వైద్య సేవలలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నదిలో ఈత కు, చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. వరద ప్రభావిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరద సహాయక చర్యలలో ఎటువంటి సమస్య లేకుండా పనిచేయాలన్నారు.
డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి విలియమ్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి .జె. అమృతం, డిఆర్డిఏ పీడీ విజయరాజు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.