• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

వరద విపత్తులను ఎదుర్కొనేందుకు మైక్రోలెవెల్ ప్లానింగ్ తో సిద్ధంగా ఉండాలి..

Publish Date : 01/07/2025

ఏలూరు, జూలై, 01: గోదావరి వరద, అకాలవరద పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఐటిడిఏ పివో, సబ్ కలెక్టర్, ఆర్డిఓలు, పోలీస్, రెవిన్యూ, ఇరిగేషన్, తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై గోదావరి వరద నియంత్రణ, ప్లాష్ ఫ్లడ్, సహాయక చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద సంసిద్ధత ప్రణాళిక కింద చేపట్టవలసిన ముందస్తు చర్యలను గత అనుభవాల నేపద్యంలో అవసరమైన ప్రత్యేక చర్యలను వివరించారు. గ్రామ, మండల, డివిజన్ స్దాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మండల స్ధాయిలో రెవిన్యూ, పోలీస్, విద్యుత్, ఫైర్ సర్వీసెస్,ఇరిగేషన్, ఆర్ అండ్ బి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల పేర్లు, అత్యవసర ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాల్లో వరద, భారీ వర్షాల పరిస్ధితులకు సంబంధించి అత్యవసర సందేశాలు పంపేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వరదలకు సంబంధించి జిల్లా సరిహద్దుల్లోని ఎఎస్ఆర్, భధ్రాద్రికొత్తగూడెం, కృష్ణాజిల్లాల అధికారులతో కూడిన ఇంటర్ డిస్టిక్ కమీటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రాచలంతోపాటు గోదావరి నదికి మరింత ఎగువ తెలంగాణాలోని ఆయా ప్రాంతాల్లో నమోదు అవుతున్న వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, తద్వారా వరద సహాయ చర్యలను మరింత ముందుగా చేపట్టేందుకు సమయం ఉంటుందని సూచించారు. కుక్కునూరు, వేలేరుపాడులో 101 నివాసిత ప్రాంతాల్లో మొదటి, రెండవ, మూడవ వరద ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ఆర్ డబ్ల్యూఎస్, డిపివో, విద్యుత్, ఎంపిడివోలతో కూడిన బృందం రిలీఫ్ కేంద్రాలను సంయుక్త తనిఖీ చేసి అక్కడవున్న సౌకర్యాలను పరిశీలించి, స్ధానికుల అవసరాలను తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని నివాసిత ప్రాంతాల్లో హ్యాండ్ పంపుల పనితీరును పరిశీలించాలని, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారంవున్నవేలాడి వుండే విద్యుత్ లైన్లను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను సమకూర్చాలన్నారు. వరద సహాయచర్యలకు వాడే జెసిబిలు, బోట్లు, తదితర యంత్రాలు, ఇన్వెంటరీ సామాగ్రి నిల్వలను సమకూర్చేందుకు సంబంధిత డిపిసి ముందుగానే సమావేశమై ఏర్పాట్లు చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8,9 నెలలు నిండిన గర్బిణీల జాబితాను సిద్దం చేసి వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అదే విధంగా వృద్ధులను కూడా గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యులంతా హెడ్ క్వార్టర్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ, చికిన్ గున్యా, డయేరియా, వైరల్ ఫీవర్లు నియంత్రణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. తగినంత క్లోరిన్ ట్యాబిలెట్లను సిద్దం చేయాలన్నారు. మొబైల్ అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఫైర్ సర్వీసెస్ వరద ప్రభావిత ప్రాంతాలకు సమీపంలో అవసరమైన రక్షణ సామాగ్రిని సిద్ధం చేయాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రజల తరలింపు, నిత్యావసర వస్తువులు,రవాణాకు అవసరమైన కండిషన్ లో ఉన్న బస్సులను సిద్దంచేయాలని ఆర్.టి.సి. అధికారులను ఆదేశించారు. మూగజీవాల రక్షణకు కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల భీమాపై ఆయా ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. పశుగ్రాసం, టిఎంఆర్ పంపిణీకి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక జెడిని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిపివోను కలెక్టర్ ఆదేశించారు. చెట్లు నేలకొరిగిన సమయంలో తొలగించేందుకు అవసరమైన పవర్ సాస్ లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పునరావస కార్యక్రమాలకు అవసరమైన బోట్లను సిద్ధంగా ఉంచాలని మత్స్యశాఖ జెడి ని కలెక్టర్ ఆదేశించారు. నూజివీడు ప్రాంతంలో గతంలో ప్లాష్ ప్లడ్ సమయంలో కోతకు గురైన గండ్ల పూడ్చివేత పనులన్నింటిని పూర్తిచేయాలన్నారు. శిథిలావస్ధలో ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్స్, విద్యాసంస్ధలు, హాస్పటల్స్ ,తదితర భవనాలకు చేపట్టవలసిన మరమ్మతులను గుర్తించాలన్నారు. వరద ప్రభావిత 10 మండలాల్లో వినియోగించేందుకు అవసరమైన డ్రోన్లను అందుబాటులో ఉంచి ట్రైయిల్ రన్ నిర్వహించాలన్నారు. ఏలూరు, నూజివీడులో వరద, అకాల వర్షాల మూలంగా సంబంవించే పరిస్ధితులను ఎదుర్కొనేందుకు మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్, ఆర్డిఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో వినియోగానికి ముందస్తుగా జనరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాకు అవసరమైన మూడు నెలల నిత్యావసర వస్తువులను సిద్ధం చేసినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను గుర్తించి అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్,విద్యుత్, వ్యవసాయ అనుబంధరంగాలు, రవాణా, ఆర్.టి.సి., వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఫైర్ సర్వీసెస్, పౌర సరఫరాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.