Close

సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్ధనల ముఖ్యోద్దేశ్యం మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం

Publish Date : 18/03/2026

ఏలూరు, మార్చి , 18 : సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్ధనల ముఖ్యోద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్ లో మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగిన ‘ఇఫ్తార్’ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాదన్నారు. పీజీ, పీహెచ్ డి వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు మంజూరు చేస్తున్నదన్నారు. అంతేకాక విదేశాలలో విద్య నభ్యసించే వారికి విదేశీ విద్యా పధకం ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నదని, మసీదులు, షాదీఖానాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇమామ్ లు, మౌజామ్ లకు గౌరవ వేతనం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.ప్రభుత్వ పధకాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందాలన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు, సహనం, ప్రతీ ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాదని , వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు.

ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ నెల రోజుల కఠోర ఉపవాస దీక్ష, ప్రార్థనల అనంతరం వచ్చే ఈ పండుగ, త్యాగానికి, మానవత్వానికి, ఐక్యతకు ప్రతీకన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. . ఇఫ్తార్ విందులు,హజ్ హౌస్ నిర్మాణం వంటి పనులు కొనసాగుతున్నాయన్నారు. . దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో నెల రోజులు రంజాన్ పండుగను ఎంతో కఠోర దీక్ష చేసి అల్లా అనుగ్రహాన్ని పొందిన అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ముస్లింల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా స్కాలర్‌షిప్‌లు, మసీదు ఇమామ్-మౌజన్‌లకు గౌరవ వేతనం, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయాలను అందిస్తున్నాయన్నారు.

ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో, ముస్లిం మత పెద్దలతో కలిసి ‘ఇఫ్తార్’ విందులో కలెక్టర్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం. ఆర్. పెదబాబు, ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, సెట్ వెల్ సీఈఓ మరియు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఇంచార్జ్ ప్రభాకర్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, జిల్లా బి.సి సంక్షేమాధికారి నాగరాణి, బిసి కార్పొరేషన్ ఈడీ పుష్పలత, జిల్లా బాలల సంక్షేమాధికారి నాగరాణి, ముస్లిం మతపెద్దలు, ప్రభృతులు పాల్గొన్నారు.