Close

సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ , వర్తకులు, వినియోగదారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 03/10/2025

ఏలూరు, అక్టోబర్, 3 : సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈ , వర్తకులు, వినియోగదారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో రెండవ వారం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహణాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులపై ఏ మేరకు జీఎస్టీ తగ్గింపుతో ఏ మేరకు లబ్ది కలుగుతుందో ప్రతీ కుటుంబానికి తెలియజేయాలన్నారు. ఇందుకోసం ప్రచురించిన కరపత్రాలను గ్రామ/వార్డ్ సచివాలయ స్థాయిలో ప్రతీ కుటుంబానికి అందించి, జీఎస్టీ 2.O కింద ఏ వస్తువుపై ఏ మేరకు తగ్గింపు వర్తిస్తుందో తెలియజేసి, వారు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలన్నారు. సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై జిల్లాలో నాలుగు వారాల పాటు ప్రతీ వారం ఒక థీమ్ తీసుకుని ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతున్నదని, మొదటివారం ఇంట్లో వినియోగించే నిత్యావసర వస్తువులు ధరల పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రెండవ వారంలో నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని,
రెండవ వారంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగాలపై జీఎస్టీ సంస్కరణలపై
ఎంఎస్ఎంఈ , వర్తకులు, వినియోగదారులతో మండల, నియోజకవర్గ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యక షాపింగ్ మేళాలు నిర్వహించేలా ఎంపిడిఓలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈనెల 4వ తేదీన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి ఈనెల 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ సేవలో’ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించనున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి కనీసం 500 మంది లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలనీ, ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు.
ఈనెల 6వ తేదీన ‘స్వచంద్ర అవార్డు’ ల కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి స్వర్ణాంధ్ర.. స్వచంద్ర కార్యక్రమంలో జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే అవార్డుల ప్రధానం కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, పలువురు ప్రజాప్రనిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున కార్యక్రమం నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.