Close

అక్టోబర్ 1వ తేదీన పెన్షన్ పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి ఎంపిడిఓ లతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 27/09/2025

ఏలూరు,సెప్టెంబర్, 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లను అక్టోబర్ 1వ తేదీన పంపిణీ చేసేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శనివారం సాయంత్రం సామజిక పెన్షన్ల పంపిణీ, సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ పై ఇంటింటికీ వెళ్లి ప్రతీ కుటుంబానికి అవగాహన కార్యక్రమాలపై ఎంపిడిఓ లతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన బ్యాంకులకు సెలవు కారణంగా 1వ తేదీన పెన్షన్ల పెంపిణీకి ఎటువంటి ఆటంకం కలగకుండా 29వ తేదీనే పెన్షన్ల సొమ్ము మొత్తాన్ని బ్యాంకుల నుండి తీసుకోవాలన్నారు. అక్టోబర్ నెల పింఛను చెల్లింపులు అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అనివార్య కారణాలు వల్ల ఆరోజు పెన్షన్లు తీసుకొని వారికి సెప్టెంబరు 02 వ తేదీన పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పింఛను పొందేందుకు పింఛను దారులు సచివాలయ సిబ్బంది ద్వారా వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అందించాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించే బాధ్యత ఆయా యంపిడివో లుపై ఉందని అన్నారు. సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ పై ఇంటింటికీ వెళ్లి ప్రతీ కుటుంబానికి అవగాహన కలిగించాలన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఏ మేరకు ఆదా అవుతున్నదో ఈనెల 29వ తేదీ ప్రతీ కుటుంబానికి తెలియజేయాలన్నారు.
జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, డిఆర్డిఏ పీడీ విజయరాజు, జిల్లాలోని ఎంపిడిఓ లు పాల్గొన్నారు.