అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేయడం అభినందనీయం. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఉంగుటూరు/ఏలూరు, జూన్ 20: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సహాయాన్ని చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్ధాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నిధులను జమ చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం లో శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 1, 60,968 రైతులకు రూ. 105.69 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్టాల్స్ ను కలెక్టర్, శాసన సభ్యులు తదితరులు సందర్శించారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులు పంట సాగు ప్రారంభం నుంచి మార్కెటింగ్ వరకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం నిరంతరం స్పందిస్తూ పరిష్కార చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొనే ప్రత్యేక బృందం రైతుల సమస్యలను ప్రతిరోజూ సమీక్షిస్తోందన్నారు. కోకో, పామాయిల్, పొగాకు, ఆక్వా, ఎరువులు, ఉద్యాన పంటలు వంటి వివిధ రంగాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులపై వెంటనే చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారీ స్థాయిలో సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా రైతు కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందుతున్నదని చెప్పారు. అలాగే రైతుల సమస్యలను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నది ప్రభుత్వ స్పష్టమైన విధానమని, భూసంబంధిత రికార్డుల ఆధునీకరణ, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, మార్కెట్ సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ అన్నదాతలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే నమ్మకంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టే ఈరోజు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈరోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడతగా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కింద 13910 మంది రైతు కుటుంబాలకు రూ. 6.96 కోట్లు, పిఎం కిసాన్ కింద 11695 మంది రైతు కుటుంబాలకు రూ. 2.34 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతు అప్పుల బాధలు తగ్గి, సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, సాగునీటి సదుపాయాలు, పంటల బీమా, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతు ఉత్పత్తికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ. 5 వేలు చొప్పున 1,60,968 మందికి రూ. 80.48 కోట్లు, పిఎం కిసాన్ కింద ఒక్కో రైతుకు రూ. 2 వేలు చొప్పున 1,26,041 మందికి రూ. 25.21 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
కార్యక్రమంలో శరణాల మాలతీ రాణి, జిల్లా స్థాయి , మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.