Close

అర్జీలు పరిష్కార తీరు పారదర్శకంగా, నాణ్యతతో ఉండాలి జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ

Publish Date : 08/12/2025

ఏలూరు,డిసెంబర్, 8 : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్‌ డా. ఎం. జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం. ముక్కంటి, భాస్కర్, దేవకీదేవి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, సర్వే ఏడి అన్సారీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. పీజేఆర్ ఎస్ లో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.
అందిన అర్జీలలో కొన్ని..

జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంనకు చెందిన ప్రత్తి నాగమణి తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామానికి చెందిన ఉప్పులూరి విజయ తన కుమార్తెకు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ నిలుపుదల చేసారని, తనకు న్యాయం చేయాలనీ కోరారు. ముదినేపల్లి మండలం వడలి గ్రామానికి చెందిన యార్లగడ్డ లక్ష్మి కనకదుర్గ తన అత్తింటివారు తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని తనకు న్యాయం చేయాలనీ కోరారు. కుక్కునూరు కు చెందిన షేక్ సైదాబీ తన భర్త మరణించిన కారణంగా పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ని తనకు మంజూరు చేయాలనీ కోరారు. మండవల్లి మండలం ఇంగిలిపాక లంక గ్రామానికి చెందిన ఘంటసాల విషు తన స్థలం ను గ్రామంలోని కొందరు కబ్జా చేసి, ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని, తన స్థలం ను తనకు ఇప్పించాల్సిందిగా కోరారు. ద్వారతిరుమల మండలం దొరసానిపాడు గ్రామానికి చెందిన రాయపాటి శ్రీనివాసరావు తన గ్రామంలోని రహదారి స్థలాన్ని కొందరు ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్నారని, ఆక్రమణలను తొలగించాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
సోమవారం జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో 363 దరఖాస్తులు అందాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేటు సిబ్బంది పాల్గొన్నారు.