Close

ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ఎప్పటికీ చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

Publish Date : 16/03/2026

పెదవేగి/ ఏలూరు, మార్చి , 16 : ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ఎప్పటికీ చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. పెదవేగి లో సోమవారం జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప యోధుడు అన్నారు. ఆంధ్రులు చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 58 రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్షచేసి ప్రాణ త్యాగానికి పూనుకుని అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు మనందరికీ మార్గదర్శకులు అన్నారు.

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకోసం కృషిచేసి, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను అర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు జీవితాన్ని నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ప్రతీ ఒక్కరూ స్మరించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆరున్నర ఎకరాల్లో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం, స్మృతి వనంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి ప్రతి సంవత్సరం మార్చి , 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.

కార్యక్రమంలో వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గారపాటి రామసీత, పెదవేగి సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ, సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి, , ప్రముఖులు బొప్పన సుధాకర్, ఈడుపుగంటి అనిల్ కుమార్, తహసీల్దార్, ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.