Close

ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం.. నులి పురుగులు నిర్మూలిద్దాం…జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 17/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 17 : జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాలలోపు వారందరికీ నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాల, వెంకటరావుపేట స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు మంగళవారం నులి పురుగుల మాత్రలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణ వల్ల అనారోగ్యంకి గురవుతారన్నారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని, అల్బెండో జోల్ మాత్రల తో వీటికి చెక్ పెట్టి ఆరోగ్యం గా ఉండవచ్చునన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ మందు పంపిణి కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వ్యాప్తంగా 3,73,873 మంది 1 నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారికి ఈనెల 17 నుండి 24 వ తేదీ వరకు ఆల్బెండజోల్ నులి పురుగు నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందుకోసం 4, 08, 012 అల్బెన్దాజోల్ టాబ్లెట్స్ సిద్ధం చేశామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రవేటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు, ఇతర సంస్థలకు పంపిణీ చేశామన్నారు. ఆహారం తీసుకునే సందర్భాల్లో ఖచ్చితంగా విద్యార్థులు శుభ్రతను తప్పక పాటించాలన్నారు. 1-2 సం.రంల వయస్సు గల వారికి 200 గ్రాముల మోతాదు, 2-19 సం.రం. వయస్సు గల వారికి 400 గ్రాముల మోతాదు వేసుకోవాలన్నారు. మాత్రలను సురక్షితమైన త్రాగునీటితో మాత్రమే వేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలోని 2221 అంగన్వాడీ కేంద్రాలలో 70 వేల 625 మంది పిల్లలలకు, 2404 పాఠశాలల్లోని 2,55,207 మంది,184 కళాశాలల్లోని 46,281 విద్యార్థులకు, 1760 మంది చిన్నపిల్లలకు మొత్తం 3 లక్షల 73 వేల 873 మంది పిల్లలకు నులిపురుగులు నివారణ మాత్రలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నలిపురుగు మాత్రలు వేయించి వారి ఆరోగ్యం పరిరక్షించాలని ఆమె తెలిపారు. నులిపురుగులు వేసిన తరవాత ఏదైనా చిన్నపాటి ఆరోగ్యసమస్యలు ఎదురైతే ఆందోళన చెందకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లేలా తల్లితండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం.. నులి పురుగులు నిర్మూలిద్దాం…అని, తల్లితండ్రులందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటలక్ష్మమ్మ, RBSK జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా: నరేంద్ర కృష్ణ , తహసీల్దార్ గాయత్రి, NDD ప్రోగ్రామ్ నోడల్ అధికారి సుబ్రహ్మణ్యం, వైద్యాధికారులు డా: శశాంక్ నరేష్.బొప్పన, ప్రభృతులు పాల్గొన్నారు.