• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఆర్ధిక అంతరాలను రూపుమాపి పేదరికం లేని సమాజం రూపొందించాలన్నదే పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

Publish Date : 30/06/2025

ఏలూరు, జూన్, 30 : ఆర్ధిక అంతరాలను రూపుమాపి పేదరికం లేని సమాజం రూపొందించాలన్నదే పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమం ఉద్దేశ్యాలను తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది ధనికులు మార్గదర్శకులై అత్యంత పేదలైన 20 శాతం బంగారు కుటుంబాలకు చేయూత ఇచ్చి వారిని అభివృద్ధి దిశగా నడిపించడమే పీ4 లక్ష్యమన్నారు. స్వర్ణాంధ్ర2047 కార్యక్రమంలో భాగంగా పేదరికం లేని రాష్ట్రాన్ని రూపొందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించడంలో పారిశ్రామికవేత్తలు సహకరించాలన్నారు. ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రివర్యులు అగిరిపల్లి పర్యటనలో పిలుపు మేరకు నూజివీడు సీడ్స్ అధినేతలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు గ్రామాలను దత్తత తీసుకున్నారన్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనాభాలో 20 శాతం అతినిరుపేదలైన కుటుంబాలను 19, 905 కుటుంబాలను గుర్తించామన్నారు. ఈ బంగారు కుటుంబాలకు జిల్లాలో అతిసుసంపన్నమైన 10 శాతం ధనికులైన మార్గదర్శకులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చి ఆయా కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు. ఆసక్తి గల మార్గదర్శకులు పీ4 వెబ్సైటు లో నమోదు అయి వారి అభీష్టం మేరకు కుటుంబాలు, గ్రామాలను దత్తత చేసుకోవచ్చన్నారు. జిల్లా యంత్రాంగం పరిశ్రమలు ఏర్పాటుచేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నదని , వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసే వారికి సబ్సిడీలతో పాటు, యూనిట్ల స్థాపనలో సాంకేతిక మద్దత్తు కూడా అందిస్తామన్నారు. జిల్లాలో ఏటా వృద్ధి రేటును 15 శాతం సాధించేలా కృషిచేయాలన్నారు. జిల్లా జిడిపి ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో ఉన్నామని, దీనిని 3 వస్థాయికి తీసుకువెళ్లేలా పారిశ్రామికంగా అభివృద్ధి సాదించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్పొరేట్ సామజిక బాధ్యత నిధులతో పారిశ్రామికవేత్తలు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. జిల్లాలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామని, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలలో యువతకు కూడా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నామని, జిల్లాలోని పారిశ్రామికవేత్తలు ఉద్యోగాల కల్పనలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగానికి విరాళాలను అందించారు.
కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, వ్యవసాయ శాఖాధికారి హబీబ్ భాష, ఉద్యానవనాలు శాఖ డిడి రామ్మోహన్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర, జిల్లాలోని వివిధ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.