Close

ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు పనితీరుపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆగ్రహం

Publish Date : 07/11/2025

ఏలూరు, నవంబర్, 7 : విధులపట్ల నిర్లక్ష్యం, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని అధికారులను ఉపేక్షించేదిలేదని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను హెచ్చరించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో, అంగన్వాడీ కేంద్రాలు, పర్యాటక శాఖకు చెందిన ప్రదేశాలలో టాయిలెట్లు నిర్మాణ పనులపై ఆర్ డబ్ల్యూ ఎస్., సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ శుక్రవారం ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలకు టాయిలెట్లు మంజూరు చేసి 3 నెలల సమయం దాటినా ఇంకా టాయిలెట్లు నిర్మించకపోవడంతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్లు నిర్మాణంలో గత రెండు నెలల నుండి ఎటువంటి పురోగతి కనిపించని కామవరపుకోట, జీలుగుమిల్లి, కైకలూరు, ముదినేపల్లి, పోలవరం, కలిదిండి మండలాల ఆర్ డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేస్తూ, 24 గంటలలోగా పనులలో పురోగతి ప్రదర్శించని సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు మంజూరుచేసిన టాయిలెట్లు, త్రాగునీటి పనులు వెంటనే పూర్తి చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు తమ శాఖకు చెందిన వసతి గృహాలకు మంజూరైన పనులు పూర్తిఅయ్యేలా సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించాలన్నారు. పనులు పూర్తి నాణ్యతతో ఉండేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలలో టాయిలెట్లు పూర్తిగా వినియోగంలో ఉండాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, వసతి గృహాల ఆవరణలో సంపూర్ణ పారిశుద్ధ్యం ఉండాలని, దోమల నిర్ములనకు చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వసతి గృహాలలో విద్యార్థులకు దోమతెరలు అందించాలని, సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. దోమల కారణంగా విషజ్వరాలు ప్రబలకుండా వసతి గృహాల ఆవరణలో ఫాగింగ్ చేయించాలన్నారు. సంక్షేమ వసతి గృహాలలో నిరుపేద విద్యార్థులు విద్య నభ్యసిస్తుంటారని, వారికి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంక్షేమ శాఖల అధికారులు సామజిక సేవ చేయడం లేదని, తీసుకునే జీతానికి న్యాయం జరిగేలా మానవతా దృక్పధంతో పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు.

సిపిఒ వాసుదేవరావు, సంక్షేమ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు.