ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖకు నిర్దేశించిన అంగన్వాడీ టాయిలెట్ల్స్ నిర్మాణాలు నెలాఖరులోగా పూర్తి చేయాలి
ఏలూరు, ఫిబ్రవరి, 19 : : విధులపట్ల నిర్లక్ష్యంతో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని అధికారులను ఉపేక్షించేదిలేదని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. జిల్లాలో పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, ఆర్ డబ్ల్యూ ఎస్, సమగ్ర శిక్ష, హౌసింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, తదితర ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 45 అంగన్వాడీ కేంద్రాలలో ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ద్వారా టాయిలెట్లు, పనులు, 108 త్రాగునీటి సరఫరా పనులు నిర్దేశించగా, ఇంకా 22 టాయిలెట్లు, 44 త్రాగునీటి సరఫరా పనులు, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం, అంబెడ్కర్ గురుకులాలకు మంజూరైన 49 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లు నిర్మాణం కేటాయించగా ఇంకా 16 పనులు ఇంకా ప్రారంభించకపోవడంపై ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు పనితీరును మెరుగుపరచుకోకపోతే శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని కలెక్టర్ హెచ్చరించారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు వారికి నిర్దేశించిన పనులు ఈనెలాఖరులోగా పూర్తిచేసి, మార్చ్, 15వ తేదీలోగా బిల్లులను అప్లోడ్ చేయాలనీ ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్లు, త్రాగునీరు సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా సురక్షిత త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు ఉండాలని, వాటికి నీటి సరఫరా సౌకర్యం ఉండాలన్నారు. సంక్షేమ వసతి గృహాలకు దోమల నిర్మూలనకు దోమ తెరలు ఏర్పాటుచేయాలన్నారు. పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలన్నారు.
ఐటిడిఏ పీడీ రాములు నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఇరిగేషన్ ఎస్ఈ లు జెడ్. రమేష్, త్రినాధ్ బాబు, దేవప్రకాష్ ఐసిడిఎస్ పీడీ శారద, హౌసింగ్ అధికారి సత్యనారాయణ, సంబంధిత శాఖల డివిజినల్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.