ఈనెలాఖరు నాటికి 1500 మంది పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను పునరావాస కాలనీలలో గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు, సెప్టెంబర్, 7 : ఈనెలాఖరు నాటికి 1500 మంది పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను పునరావాస కాలనీలలో గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై స్థానిక కలెక్టరేట్ లో గౌతమీ సమావేశపు హాలులో సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల పూర్తిపై ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాల ననుసరించి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి డిసెంబర్ లోగా పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులను కాలనీలకు తరలించేందుకు సెప్టెంబర్ నెల నుండి డిసెంబర్ వరకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం జిల్లా చింతూరు కు చెందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఏలూరు జిల్లాలో పునరావాస ఇళ్లను మంజూరు చేశారని, ఈనెల 9 లేదా 10 తేదీలలో పునరావాస కాలనీలకు వారిని తీసుకువచ్చి వారికి మంజూరు చేసిన పునరావాస ఇళ్లను వారికి చూపించి, వారు సంతృప్తి చెందిన అనంతరం ఇళ్లకు విద్యుత్, త్రాగునీరు వంటి ప్రాధమిక సౌకర్యాలు పూర్తిగా ఏర్పాటుచేసి, ఈ నెలాఖరులోగా గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీ పరిసరాలను శుభ్రంచేసి సిద్ధంగా ఉంచాలన్నారు. కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు కాలనీలలో రోడ్లు, డ్రైనేజి, అంగన్వాడీ, పాఠశాలలు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను నిర్వాసితులను కాలనీలకు తరలించే ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, భూమికి భూమి పరిహారం అంశాలలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ లు జెడ్. రమేష్, విజయరత్నం, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, భూసేకరణ విభాగం అధికారులు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.