Close

ఈ నెల 16 నుండి జూలై 31 వరకు జిల్లాలో “స్టాప్ డయేరియా క్యాంపెయిన్– 2026” సమర్థవంతంగా నిర్వహించాలి. గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .

Publish Date : 17/06/2026

ఏలూరు, జూన్ 17: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం “ఈ నెల 16 నుండి జూలై 31 వరకు జిల్లాలో “స్టాప్ డయేరియా క్యాంపెయిన్ –2026” పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులకు క్యాంపెయిన్ లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై జిల్లా కలెక్టరు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వర్షా కాలంలో డయేరియా వ్యాధి ప్రబలుకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టేందుకు జిల్లాలో ఈనెల 16 తేదీ నుండి జూలై 31 వ తేదీ 2026 వరకు “స్టాప్ డయేరియా క్యాంపెయిన్ –2026” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన క్యాంపెయిన్ గోడపత్రికలను విడుదల చేశామని, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో విసృతంగా ప్రచారం చెయ్యాలని అన్నారు. వర్షాకాలంలో సాధారణంగా డయేరియా, నీటిద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియా బారిన పడకుండా కాపాడటం, డయేరియా వల్ల సంభవించే మరణాలను పూర్తిగా నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతి ఇంటికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ, జింక్ మాత్రలు వినియోగం పై అవగాహన కల్పించాలని అన్నారు. సురక్షిత తాగునీటి వినియోగం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఆహార పరిశుభ్రత వంటి అంశాలుపై విస్తృత ప్రచారం చెయ్యాలని అన్నారు. గ్రామ,వార్డు స్థాయిలో ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి డయేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వైద్య అధికారులు క్యాంపెయిన్ వివరాలు ఎప్పటికప్పుడు వివరాలను తెలియ చేస్తూ, డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని వెంటనే వినియోగించాలని ప్రజలకు సూచించాలని తెలిపారు.జిల్లాలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా అన్ని శాఖలు సమిష్టిగా కృషిచెయ్యాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, డిప్యూటీ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.యస్. పద్మావతి, డీసీహెచ్ఎస్ డా.సి.హెచ్. బేబి కమల, జిల్లా ప్రజా రవాణాధికారి యస్.కె.షబ్నమ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్. సూర్యచక్రవేణి, జిల్లా సంబంధిత వివిధ శాఖలు అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.