Close

ఈ రోజు పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు 313. జిల్లా జాయింట్ కలెక్టరు డా. ఎం. జె.అభిషేక్ గౌడ …

Publish Date : 29/12/2025

ఏలూరు, డిసెంబరు 29: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టరు డా. ఎం. జె.అభిషేక్ గౌడ నిర్వహించారు. జాయింట్ కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, కెఆర్ సిసి డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ లు స్వీకరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు అభిషేక్ గౌడ మాట్లాడుతూ పిజిఆర్ యస్ దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి వారం వారం ప్రత్యేక రివ్యూ చేస్తున్నారని తెలిపారు. పిజిఆర్ఎస్ ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో జరిగే పిజిఆర్ యస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులతో చిరునవ్వుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుని, విచారించి చక్కని పరిష్కారం చూపాలని అన్నారు. ఫిర్యాదులు పరిష్కారంలో ఫిర్యాదుదారులు సంతృప్తి పడేవిధంగా సమస్యలు పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు.

ఈ రోజు పిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలలో కొన్ని .

కొయ్యలగూడెం మండలం సుభద్రపాలెం నకు చెందిన పాతకోకిల వెంకటేశు తనకు కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురంలో 57 సెంట్లు పొలం ఉందని, పక్క పొలం వారు తన పొలంలో గేదెల మేపుతూ తన మీద తన భార్య, కుమారుల మీద దౌర్జన్యం చేస్తూ తిడుతూ, కొడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీ నర్సాపురం మండలం ఈపికుంట గ్రామానికి చెందిన యారిచర్ల వీరయ్య తన దరఖాస్తులో తనకు రెండు ఎకరాల పొలం ఉందని ఆ వివరాలను ఆర్ ఎస్ ఆర్ లో నమోదు చేసి మ్యూటేషన్ మరియు ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. ముసునూరు మండలం గొల్లపూడి కి చెందిన భూపతి మూర్తిరాజు తనకు మత్స్యకార పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల సుబ్బరాజు తమ గ్రామంలో పశువులకు మరియు ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో చెరువులు తవ్వాల్సిందిగా కోరారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని జెసి అభిషేక్ గౌడ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు పరిపాలన అధికారి యన్.వి. నాంచారయ్య, సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.