ఉంగుటూరు మండలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు, గొర్రెలకు వాక్సిన్ లను పరిశీలించిన కలెక్టర్
ఉంగుటూరు, నవంబర్, 19 : విన్నూత్న రీతిలో ఉద్యానవన పంటలు సాగుచేయడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు లో ఔత్సాహిక రైతు పునపరాజు మురళీకృష్ణంరాజు సాగు చేస్తున్న ‘డ్రాగన్ ఫ్రూట్’ విధానాన్ని కలెక్టర్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇతర ప్రాంతాలలోని వాతావరణ పరిస్థితులలో పెరిగే ఉద్యాన పంటలను మన ప్రదేశంలో వాటికి అటువంటి వాతావరణం కల్పించి సాగుచేసి సత్ఫలితాలను సాధించడం రైతు కృషికి నిదర్శనమన్నారు. అటువంటి రైతులను ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు కావలసిన సూచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఉద్యానవన శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతు మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్ సాగుపై అవి పెరిగే ప్రదేశంలోని రైతులను అడిగి తెలుసుకున్నానని, తన 5 ఎకరాలలో అధిక సంఖ్యలో సాగుచేసే విధంగా విన్నూత్నంగా కాంక్రీట్ పోల్ విధానంలో సాగు చేస్తున్నానన్నారు. రసాయనిక ఎరువులు వినియోగించకుండా సేంద్రియ ఎరువుల వినియోగిస్తున్నామన్నారు.
అనంతరం అక్కుపల్లి గోకవరం గ్రామంలో గొర్రెలకు డీవార్మింగ్, వాక్సిన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశు వైద్య సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1962 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటుచేసిందన్నారు. పశు వైద్య సేవలకు అత్యవసర పరిస్థితిలో 1962 నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే పశు వైద్య సేవల వాహనం ద్వారా వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు. ఈ సేవల వివరాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని కలెక్టర్ పశుసంవర్ధక శాఖాధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, అసిస్టెంట్ డైరెక్టర్ ఉష రాజకుమారి, మత్య్సశాఖ జాయింట్ డైరెక్టర్ నాగలింగాచార్యలు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.నెహ్రూబాబు , తహసీల్దార్ వై. పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపిడిఓ గంజి రాజ్ మనోజ్ , ప్రభృతులు పాల్గొన్నారు.