ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు, జనవరి, 29: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి కోరారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందన్నారు. ఆరోజు నుండి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరణ, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8.00 గం. నుండి సాయంత్రం 4.00 గం. వరకు పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పోలింగ్ ఉంటుందని, మార్చి 3వ తేదీన కౌంటింగ్ ఉంటుందన్నారు. మార్చి 8వ తేదీ నాటికి పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభధ్రుల నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 440 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిలో 3,15,261 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అదే విధంగా ఈ ఎన్నికల నేపద్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందన్నారు.
సమావేశంలోజిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, నెరుసు నెలరాజు(బిజెపి), ఎస్. అచ్యుత బాబు(టిడిపి), డిఎన్ విడి ప్రసాద్(సిపిఐఎం), ఎం. కృష్ణ(జనసేన), ఎ. రతన్ కాంత్(బిఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.